V6 News

తెలంగాణకు రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు.. సీఎం రేవంత్ పై పీసీసీ ప్రశంసలు

తెలంగాణకు రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు.. సీఎం రేవంత్ పై పీసీసీ ప్రశంసలు

యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోందన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. చారిత్రాత్మక సమ్మిట్ నిర్వహించిన సర్కార్ కు అభినందనలు తెలిపారు. లక్షల కోట్ల పెట్టుబడులు రావడం సంతోషమన్నారు. ప్రపంచ నగరంగా హైదరాబాద్ మారబోతుందని చెప్పారు. పదేండ్ల విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్నామని చెప్పారు మహేశ్. సీఎం రేవంత్ ను కాంగ్రెస్ తరపున అభినందిస్తున్నామన్నారు. 

చదువుకున్న యువత సర్పంచ్ లుగా పోటీ చేస్తున్నారని చెప్పారు మహేశ్ కుమార్ గౌడ్. గ్రామాల్లో చాలా వరకు ఏకగ్రీవాలు అవుతున్నాయని చెప్పారు. గ్రామాలు బలంగా ఉంటేనే దేశం.. బలంగా ఉన్నట్టని తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలన్నదే తమ కోరిక అన్నారు.బీఆర్ఎస్ కు రాష్ట్రంలో భవిష్యత్ లేదన్నారు.  తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ అని కొనియాడారు మహేశ్. సోనియా లేకుంటే వందేండ్లైనా రాష్ట్రం వచ్చేది కాదన్నారు. ఆనాడు టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలు పోరాడితే తెలంగాణ రాలేదన్నారు. సిటీని విశ్వనగరంగా మార్చబోతున్నామని చెప్పారు.

5 లక్షల కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతోంది. పలు దేశ , విదేశీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. రెండో రోజు కూడా  భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు పారిశ్రామిక వేత్తలు.  రెండో రోజు 2 లక్షల 96  వేల 995  కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి పలు జాతీయ ,అంతర్జాతీయ కంపెనీలు.  మొదటి రోజు 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు రోజుల్లో డిసెంబర్  9న సాయంత్రం 4 గంటల వరకు 5 లక్షల 39 వేల 495 కోట్ల పెట్టుబడులకు తెలంగాణ  ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది.