- కేంద్రం ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
- పీసీసీ చీఫ్ మహేశ్ డిమాండ్
- ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్వద్ద ధర్నా
ముషీరాబాద్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం అన్యాయమని టీపీసీసీ చీఫ్, ఎమ్యెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాచౌక్లో శనివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ భారీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడం రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.
ఆ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు కార్మికులు, రైతులు, పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ల హక్కులు, ఉపాధి భద్రతకు కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన వీబీ- జీ రామ్ జీ చట్టం కార్మికుల హక్కులను కాలరాస్తోందన్నారు.
ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు దేశవ్యాప్తంగా ఐఎన్‌టీయూసీ పోరాడుతుందని, ఫీల్డ్ అసిస్టెంట్లకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ధర్నాలో ముఖ్య ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.నాగన్న గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ నేతలు పాల్గొన్నారు.
