దేశమంతటా కులగణన కాంగ్రెస్ విజయమే: మహేశ్ కుమార్

దేశమంతటా కులగణన కాంగ్రెస్ విజయమే: మహేశ్ కుమార్
  • తెలంగాణ మోడల్‌ను కేంద్రం అనుసరిస్తున్నది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • రాష్ట్రంలో కులగణనను వ్యతిరేకించినోళ్లు.. ప్రధాని ప్రకటనతో జీర్ణించుకోలేకపోతున్నరు: మంత్రి పొన్నం
  • బీసీ బిల్లులను రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్‌‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ బీసీ ప్రజాప్రతినిధులు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పోరాటంతోనే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, ఇది తమ పార్టీ సాధించిన విజయమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. విద్య, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు కాంగ్రెస్ బీసీ ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌లో గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి థ్యాంక్స్ చెప్పారు. అనంతరం రాజ్‌‌‌‌‌‌‌‌భవన్ ఎదుట మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జనగణనతో పాటు కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. కాంగ్రెస్, రాహుల్ గాంధీ సాధించిన విజయం. తెలంగాణ మోడల్‌‌‌‌‌‌‌‌ను కేంద్రం అనుసరిస్తున్నది. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో రాజకీయంగా రాహుల్ ఆశయం నెరవేరింది. రాహుల్ ఆదేశం మేరకే తెలంగాణలో మా ప్రభుత్వం కులగణన నిర్వహించింది. దేశ చరిత్రలో కులగణన నిర్వహించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పింది. కామారెడ్డి డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగానే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం” అని తెలిపారు. 

కులగణనను విమర్శిస్తున్నోళ్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి: పొన్నం  

రాష్ట్రంలో కులగణన జరిగినప్పుడు వ్యతిరేకించిన నేతలు.. ఇప్పుడు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రకటించడంతో జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ‘‘కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్వహించి, బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతిలో జరిగిన కులగణనను విమర్శిస్తున్నోళ్లు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి” అని అన్నారు. గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన సమావేశంలో మాజీ ఎంపీలు కేశవరావు, అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, మక్కాన్ సింగ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.