కేసీఆర్ సర్కార్ పై బెల్టు తీయాలె : రేవంత్ రెడ్డి 

కేసీఆర్ సర్కార్ పై బెల్టు తీయాలె : రేవంత్ రెడ్డి 

2014లో కేసీఆర్ ప్రభుత్వం రాకతో వరంగల్ కు గ్రహణం పట్టిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్ ఈస్ట్, వెస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిల్లా-రంగా మాదిరిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు దండుపాళ్యం ముఠాగా ఏర్పడి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజంజాహి మిల్లు భూములను కూడా బీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు వరంగల్ పై ప్రేమలేదని, ఇక్కడి భూములపైనే వారికి ప్రేమ ఉందన్నారు. తెలంగాణ తీసుకువచ్చిన వాళ్లకు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను అభ్యర్థించారు. 

తెలంగాణలో ఇందిరమ్మ పాలన తీసుకొస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన గౌరవాన్ని కొండా సురేఖకు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బెల్టుషాపులు పెడితే బట్టలూడదీసి బొక్కలో వేస్తామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కార్ పై బెల్టు తీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొనసాగుతోంది. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు.. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డికి భారీ గజమాలతో స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి వెంట ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, కొండా మురళి, కొండా సురేఖ, కొండా సుస్మితా పటేల్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఉన్నారు. అంతకుముందు.. రేవంత్ రెడ్డి మండిబజార్ జెండా దర్గాను దర్శించుకుని.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.