
ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్పై అనర్హత వేటుకు సంఘీభావంగా గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. పదే పదే తనకు కుటుంబం లేదని చెప్పి మోడీ దేశాన్ని నమ్మిస్తున్నారని రేవంత్ అన్నారు. దేశ సంపదను మోడీ తన స్నేహితులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని రాహుల్ గాంధీ తేల్చారని చెప్పారు. అదానీ ఇష్యూపై లోక్ సభలో మోడీని రాహుల్ నిలదీస్తే ఇప్పటివరకు సమాధానం లేదన్నారు. దైర్యం లేని బీజేపీ రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేసిందని రేవంత్ మండిపడ్డారు. 3
రాహుల్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దం : కోమటిరెడ్డి
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అనర్హుడిగా ప్రకటించి రాహుల్ గొంతునొక్కారని విమర్శించారు. రాహుల్పై అనర్హత వేటుకు సంఘీభావంగా మార్చి 26న గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే రాహుల్ పై అనర్హత వేటు వేశారని కోమటిరెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్దమేనని స్పష్టం చేశారు. సోనియా గాంధీ, ఖర్గే ఆదేశిస్తే తామంతా పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామ చేస్తామన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ సభ్యులమంతా ఒకే మాటపై ఉంటామన్నారు.