అధిష్టానం నిర్ణయించిన వ్యక్తిని సీఎం గద్దెపై కూర్చోబెడ్తా : రేవంత్ రెడ్డి

అధిష్టానం నిర్ణయించిన వ్యక్తిని సీఎం గద్దెపై కూర్చోబెడ్తా : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకరావడమే తన లక్ష్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అధిష్టానం నిర్ణయించిన వారిని సీఎం గద్దెపై కూర్చోబెట్టే వరకూ తాను విశ్రమించనని స్పష్టం చేశారు. టీపీసీసీ ఇంచార్జ్గా మాణిక్ రావ్ ఠాక్రే వచ్చాక పార్టీలో గొడవలన్నీ సమసిపోయాయని చెప్పారు. నాగర్ కర్నూల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 సీట్లలోనూ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పాలమూరులో కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ఇచ్చినవేనన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రారంభించింది కాంగ్రెస్ అన్న ఆయన.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను మంజూరు చేసింది కాంగ్రెస్సే అని చెప్పారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు.  

తెలంగాణకు దళితుడు కాదు దరిద్రుడు సీఎం అయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దళితులు, గిరిజనులకు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. దళితులు, గిరిజనుల త్యాగాలతో సాధించిన తెలంగాణను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలపుడు ఓట్ల కోసం వస్తే కేసీఆర్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. నాగం జనార్ధన్ తో పెట్టుకుంటే గాలి జనార్ధన్ రెడ్డికి పట్టిన గతే మర్రి జనార్ధన్ రెడ్డికి పడుతుందని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, మర్రి జనార్ధన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. దొరలకు బీఆర్ఎస్, పెట్టుబడిదారులకు బీజేపీ ఉంటే దళిత , గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పారు. 

దాడులకు భయపడేది లేదు : ఠాక్రే

మార్కండేయ ప్రాజెక్టు చూడటానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నేతలు దాడులకు దిగడం దుర్మార్గమని టీపీసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. దాడులకు భయపడేది లేదని, పేదల పక్షాన కాంగ్రెస్ ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ దాడులకు పాల్పడితే కాంగ్రెస్ ప్రజల తరుపున పోరాడుతుందని చెప్పారు. పార్టీ తీసుకునే నిర్ణయాలకు అందరి మద్ధతు ఉండాలని కోరారు.