ఈటల కొత్త సీసాలో పాత సారాలాంటోడు

ఈటల కొత్త సీసాలో పాత సారాలాంటోడు
  • మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనమే భయపడే పరిస్థితి వచ్చింది
  • ప్రశ్నించేతత్వాన్ని అణచడానికే యువతను మత్తులో ముంచుతున్నారు
  • కేసీఆర్.. నిన్ను పాతాళానికి తొక్కడమే నా పని
  • హుజూరాబాద్ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి

హుజూరాబాద్: మామ ఆణిముత్యం అయితే.. అల్లుడు స్వాతిముత్యంలా నటిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, హరీశ్ రావు మోసపు మాటలతో మోసం చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రశ్నించేతత్వాన్ని అణచడానికి యువతను మత్తులో ముంచుతున్నారని రేవంత్ మండిపడ్డారు.

‘రాష్ట్రం మొత్తం హుజూరాబాద్ వైపు ఆసక్తిగా చూస్తోంది. ఇద్దరు వ్యక్తులు 20 ఏండ్లుగా సహజీవనం చేసి.. వాటాల పంపాకాల్లో తేడాలొచ్చి విడిపోయారు. కేసీఆర్ అక్రమ సంపాదనలో ఈటల వాటా అడిగినందుకే ఈ ఉపఎన్నిక. ఫీజు రీయంబర్స్ మెంట్ కోసమో, నోటిఫికేషన్ల కోసమో, రైతులకు గిట్టుబాటు ధర కోసమే, రుణమాఫీ కోసమో ఈ ఉపఎన్నిక రాలేదు. పంపకాల్లో తేడాల వల్లే ఉపఎన్నిక వచ్చింది. టీఆర్ఎస్ వాళ్లు సొంత పార్టీ నాయకులనే డబ్బులిచ్చి కొంటున్నారు. తెలంగాణను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టేందుకు టీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సారా పాతదే కానీ, సీసా మాత్రం కొత్తది అన్నట్లుగా ఈటల బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి చిల్లు పడిన గెల్లు పోటీలో ఉన్నాడు. చిల్లు పడిన నోటు ఎక్కడా చెల్లదు. 

మీరు నాన్‎లోకల్ కానప్పుడు.. బల్మూరి వెంకట్ ఎలా నాన్‎లోకల్ అవుతాడు?

బల్మూరి వెంకట్ ను నాన్ లోకల్ అంటున్నారు. అసలు కేసీఆర్ కు గజ్వేల్ తో, కేటీఆర్ కు సిరిసిల్లతో, హరీశ్ రావుకు సిద్ధిపేటతో సంబంధం లేనేలేదు. వీళ్లు నాన్ లోకల్ కానప్పుడు.. బల్మూరి వెంకట్ మాత్రం ఎలా నాన్ లోకల్ అవుతాడు? ప్రజలు మీకు అవకాశమివ్వడంతో విర్రవీగుతున్నారు. ఇంటికో ఓటు వేసి వెంకట్‎ను గెలిపించండి. రాష్ట్రంలో కేసీఆర్ నిజాం నవబ్ అయితే.. హరీశ్ రావు కాశీం రిజ్వి. హుజూరాబాద్‎లో గెలవడానికి టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే. అందుకే కాంగ్రెస్ పార్టీ మీద మాటలదాడి చేస్తున్నారు. మోడీ దేశ జీడీపీ పెంచుతా అంటే నమ్మినం. కానీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యడి నడ్డి విరుస్తాడనుకోలేదు.

మామ ఆణిముత్యం అయితే.. అల్లుడు స్వాతిముత్యం

పోలీస్ వ్యవస్థ రెండు వర్గాలుగా చీలిపోయింది. రిటైర్డ్ అధికారులతో ఓ టీం ఏర్పాటు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర డీజీపీ ఫోన్ కూడా ట్యాప్ అవుతోంది. నాతో పాటు నా కుటుంబసభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి. ఇలాంటి పనులతో కేసీఆర్ యుద్ధ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో చిప్పలు కడిగేటోడు ఇక్కడకొచ్చి మంత్రి కావొచ్చు. గొప్ప చదువులు చదువుకున్న వాళ్లు ప్రజాసేవ చేయకూడదా? తెలంగాణలో ఎందుకీ నిర్భంధాలు. మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనమే భయపడే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ పాలన చూస్తుంటే... ఎందుకు దేవుడా తెలంగాణలో నక్సలిజం కూడా చేశావు అనిపిస్తోంది. నక్సలైట్లు లేకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరిగింది. చట్టాలు చేసేటోళ్లం మాకే ఇలా అనిపిస్తుందంటే.. సామాన్యులకు ఎలా ఉంటుందో ఆలోచించండి. కేసీఆర్ పాలన వదిలేసి.. డ్రగ్స్, గంజాయి, గుడాంబాల మీద సమీక్షలు చేస్తున్నాడు. కేటీఆర్ ఏమో పార్టీ ప్లీనరీ కోసం వంటా వార్పు చూసుకుంటున్నాడు. ఇక కవితక్క ఏమో.. బతుకమ్మ అని ఆటపాట మీద ఉన్నారు. మామ ఆణిముత్యం అయితే.. అల్లుడు స్వాతిముత్యం. హరీశ్ రావు నటనలో కమల్ హాసన్ ను మించిపోయిండు. ప్రశ్నించేతత్వాన్ని అణచడానికే యువతను మత్తులో ముంచుతున్నారు. కేసీఆర్.. నిన్ను పాతాళానికి తొక్కడమే నా పని’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.