కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే బీజేపీ లక్ష్యం

కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే బీజేపీ లక్ష్యం

న్యూఢిల్లీ: కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే బీజేపీ లక్ష్యమని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారమే  టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... విపక్షాల ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు సమావేశానికి కాంగ్రెస్ తో సహా చాలా పార్టీల నాయకులు వచ్చారని, కానీ కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆ సమావేశంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మమతా బెనర్జీ ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిందని తెలిపారు. అనంతరం కేసీఆర్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారని, ఈ క్రమంలోనే హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హా పరిచయ సభను నిర్వహించారని చెప్పారు. అయితే పీకే ప్లాన్ ప్రకారమే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. బెంగాల్ తరహాలో విపక్షాలను లేకుండా చేయడానికి  పీకే కుట్రలు పన్నారని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఫైర్ అయ్యారు. కేసీఆర్, మోడీ ప్రభుత్వాలపై ప్రజలు, నాయకుల్లో వ్యతిరేకత మొదలైందని, అందుకే వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని రేవంత్ అన్నారు.

చేరికల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ లో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. తమ పార్టీలో చేరబోయే నేతలను విషయాలను ముందే ప్రకటించడం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తోందని, అందుకే మీడియాకు ముందుగా చెప్పడం లేదని రేవంత్ వెల్లడించారు. విష్ణువర్ధన్ రెడ్డికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కావాలనే మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. విష్ణువర్ధన్ రెడ్డి  తనను కూడా ఆహ్వానించారని... కానీ అనివార్య కారణాలు వెళ్లలేకపోయాయనని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 7తో తాను టీపీసీసీ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతుందని, సంవత్సర కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని రేవంత్ చెప్పారు. ఏడాదిలో తన సారథ్యంలో చేపట్టిన కార్యక్రమాలను కేసీ వేణు గోపాల్ కు వివరించినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.