ప్రజల దృష్టిని మరల్చడానికి మోడీ, కేసీఆర్ ప్రయత్నం

ప్రజల దృష్టిని మరల్చడానికి మోడీ, కేసీఆర్ ప్రయత్నం

హైదరాబాద్: ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బడక్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు సోమవారం (జులై 4న) కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పిన రేవంత్ రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ప్రజా సమస్యల పరిష్కారంపై కేసీఆర్ కు దృష్టిలేదని, అందుకే చాలామంది టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ, కేసీఆర్ కలిసి డ్రామాలాడుతున్నారని, ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ప్లెక్సీ వార్ కు తెరలేపారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిందని చెప్పారు. రాష్ట్రంలో విభజన హామీలు చాలా పెండింగ్ లో ఉన్నప్పటికీ.. బీజేపీ వాటిపై ఫోకస్ పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడు రోజులు బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారే తప్ప.. ప్రజా సమస్యల గురించి వారికి శ్రద్ధలేదని మండిపడ్డారు. రాజకీయాలను కూడా మోడీ, కేసీఆర్ అవుట్ సోర్సింగ్ చేశారని, రాజకీయాల్లో చిల్లర సంస్కృతికి తెరలేపారని ఆరోపించారు.  మహిళలపై దాడులు, హైదరాబాద్ వరదలు, రైతుల కష్టాలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కేసీఆర్ ను బీజేపీ ప్రశ్నించలేదని.. అగ్నిపథ్, నిరుద్యోగం, నిధులు, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి పలు విషయాలపై టీఆర్ఎస్ బీజేపీని నిలదీయలేదని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందనే విషయం అర్థమవుతోందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ అవగాహనతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు ప్రజలకు తెలుసునని, రాబోయేకాలంలో ఆ రెండు పార్టీలకు పరాభవం తప్పదని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేవాళ్లకు కాంగ్రెస్ లో స్థానం ఉంటుందని అన్నారు. 

స్థానిక సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ లో చేరా... బడక్  పేట మేయర్  పారిజాత నరసింహారెడ్డి

స్థానిక సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తే... టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టిందని, అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు బడక్ పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి స్పష్టం చేశారు. చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని, పై అధికారులకు సమాచారమిస్తే పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కాంగ్రెస్ లో ఉంటేనే సాధ్యమని నమ్మి... రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరానని తెలిపారు.