ఇసుక మీద ఎవడన్న ప్రాజెక్టు కడ్తడా: రేవంత్రెడ్డి

ఇసుక మీద ఎవడన్న ప్రాజెక్టు కడ్తడా: రేవంత్రెడ్డి
  • మేడిగడ్డ అణా పైసకు పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదు
  •  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా వెంకటస్వామి ప్రతిపాదన
  • దాని ప్లాన్ మార్చి అస్తవస్తంగా కాళేశ్వరం కట్టిన కేసీఆర్
  • కేసీఆర్ కు సోనియా అపాయింట్మెంట్ ఇప్పించిందే కాక
  • వివేక్, వినోద్ ను గెలిపిస్తే కాకా కుటుంబం మీకు అండగా ఉంటది
  • నూరు కేసులున్న బాల్క సుమన్ కు వేలకోట్ల ఎక్కడి నుంచొచ్చినై
  • ఢిల్లీలో వెంకటస్వామి గారి ఇల్లే ఇప్పుడున్న ఏఐసీసీ ఆఫీసు
  • ఇందిరమ్మ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డ నాయకుడు కాకా
  • బెల్లంపల్లి, రామగుండం సభల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

బెల్లంపల్లి/రామగుండం: ‘ఇండ్లు కట్టుకుంటేనే లోతుగా పునాది తీస్తం.. సీఎం కేసీఆర్ మాత్రం ఇసుకమీదే ప్రాజెక్టు కట్టిండు.. ఇసుక మీద ఎవడన్న ప్రాజెక్టు కడ్తడా..? ఇప్పుడు పిల్లర్లు కూలుతున్నయ్.. మేడిగడ్డ అణాపైసకు పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదు..’అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ బెల్లంపల్లి, రామగుండంలలో నిర్వహించిన భారీ బహిరంగసభల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్ల నిర్మాణం కాకా వెంకటస్వామి కల అని, ఆయన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదన పెట్టారని, ఆయన ఆలోచనతోనే తుమ్మడి హెట్టి వద్ద ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని అన్నారు. కేసీఆర్ ఆ ప్రాజెక్టు ప్లాన్ మార్చి లక్ష కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు.

తెలంగాణ పోరాటంలోనూ కాకా వెంటకస్వామి కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. 2004లో కరీంనగర్ కు సోనియాగాంధీ వచ్చినప్పుడు తెలంగాణ ఇస్తామని ప్రకటన చేయించింది కూడా కాక వెంకటస్వామేనని గుర్తు చేశారు. ఆ కుటుంబం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ఎల్లప్పుడూ అండగానే ఉంటూ వస్తోందని అన్నారు. ఇక్కడి ప్రతి కుటుంబంతో ఆ కుటుంబానికి అనుబంధం ఉన్నదన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓ దుర్మార్గుడని, ఆయన కండ్లకు ఖాళీ భూమి కనిపించొద్దు.. అందమైన ఆడపిల్ల కనిపించొద్దని అన్నారు. దుర్గం దుర్మార్గాల గురించి ఇక్కడి ఆడపిల్లలే బయటికి వచ్చి చెప్తున్నారని అన్నారు.

అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టాల్సిన కేసీఆర్.. మళ్లీ గెలిపించుమని ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చారని ఫైర్ అయ్యారు. అంటే కేసీఆరే మీ పిల్లలకు రక్షణ ఉండదు.. అని చెబుతున్నారా.? అని ప్రశ్నించారు. 

బాల్క సుమన్ వేల కోట్లు ఎట్లొచ్చినయ్..

గత ఎన్నికల సమయంలో తనపై నూరు కేసులున్నయ్.. వివేక్ వద్ద వందల కోట్ల రూపాయలున్నయని చెప్పారని, అలాంటి వ్యక్తికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వివేక్ కుటుంబం వ్యాపారాల్లో ఉందని, వాటిలో ఆర్జించిన డబ్బును సేవా కార్యక్రమాలకు కూడా వినియోగిస్తోందని అన్నారు. బాల్క సుమన్ ఓ అవినీతి పరుడని, సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇక్కడి భూముల చెరబట్టి అమ్ముకున్నారన్నారు.

అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు రక్షణ కరువవుతుందని చెప్పారు. ఆలోచించి చెన్నూరు నుంచి వివేక్, బెల్లంపల్లి నుంచి వినోద్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిండుమనసుతో కాకా కుటుంబాన్ని ఆశీర్వదించాలని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పారు. 

ఏఐసీసీ ఆఫీసు కాకా దే..

ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు కాకా వెంకటస్వామి నివాసమని, ఇందిరాగాంధీకి కష్టం వచ్చినప్పుడు వెన్నంటి ఉన్న మహా నేత వెంకటస్వామి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ ఆ ఇంట్లోనే కార్యకలాపాలు జరుగుతున్నాయని వివరించారు. ఇద్దరు గడ్డం సోదరుల తరఫున తాను మూడో సోదరుడిగా మీ ముందుకు వచ్చానని వీళ్లిద్దరినీ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పేదల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, కార్యకర్తల మీద అక్రమంగా పెట్టిన కేసులను ప్రభుత్వం రాగనే ఎత్తేస్తుందని చెప్పారు.

ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కులు కాంగ్రెస్ వేనని అన్నారు. 2004లో 9 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించిన ఘనత వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానన్న కేసీఆర్.. 150 గదులతో 2 వేల కోట్లు వెచ్చించి ప్రగతి భవన్ కట్టుకున్నారని ఫైర్ అయ్యారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడిందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

బెల్లంపల్లి అభ్యర్థి వినోద్ మాట్లాడుతూ.. తమ తండ్రి కాక ఆశీర్వాదంతోనే తాము రాజకీయాల్లో ఉన్నామన్నారు. తాను తన తమ్ముడు వివేక్ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ఎంత ప్రయత్నించినా సోనియాగాంధీ అపాయింట్ మెంట్ దొరకలేదని, కాక వెంకటస్వామే కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇప్పించారని అన్నారు. అలా సాధించుకున్న తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేవారు. నవంబర్ 30న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని అన్నారు.