ములుగు జిల్లాలో ఉత్సాహంగా హాత్ సే హాత్ జోడోయాత్ర

ములుగు జిల్లాలో ఉత్సాహంగా హాత్ సే హాత్ జోడోయాత్ర

ములుగు, వెంకటాపూర్(రామప్ప), వెలుగు :టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి పర్యటన ములుగు జిల్లాలో ఉత్సాహంగా సాగింది.  హాత్ సే హాత్ జోడోయాత్రలో భాగంగా రెండు రోజుల రేవంత్​పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు తెచ్చింది. మేడారంలో మొదలైన పాదయాత్ర ములుగు జిల్లాకేంద్రంలో ముగిసింది. మంగళవారం వెంకటాపూర్ మండలం రామప్పగుడిలో ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రేవంత్​రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. రేవంత్​రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వంలో పురావస్తు శాఖ పనితీరు జీరో అంటూ కామెంట్ చేశారు.

రెండోరోజు 16కిలోమీటర్ల పాదయాత్ర

మొదటిరోజు రేవంత్​రెడ్డి 14కిలోమీటర్లు నడవగా, రెండో రోజు వెంకటాపూర్ మండలం రామప్ప ఆలయం నుంచి బయలుదేరారు. నర్సాపూర్‌‌‌‌లో భోజనం చేశారు. అక్కడి నుంచి 16కిలోమీటర్లు నడిచి రాత్రికి ములుగుకు చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్​లో మాట్లాడారు. కార్యకర్తలు, నాయకుల నినాదాలతో ములుగు హోరెత్తింది. 

చెల్లెమ్మ సెంటిమెంట్ తో సీతక్కకు మైలేజీ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోదరిగా పిలిచే ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో మేడారం నుంచి యాత్ర ప్రారంభించడం పొలిటికల్​గా ఆమెకు మైలేజీ వచ్చిందని పలువురు భావిస్తున్నారు. ఇటీవల జోడోయాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సీతక్క పాల్గొన్నారు.  పాదయాత్రలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ మాజీ మేయర్ స్వర్ణ, విజయరమణారావు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌‌చార్జి సత్యనారాయణ రావు, కాంగ్రెస్ జిల్లా లీడర్లు అశోక్, రాంరెడ్డి, రాజేందర్ గౌడ్, రవిచందర్, సత్తిరెడ్డి, చంద్రమౌళి పాల్గొన్నారు. 

ప్రజాసేవకే అంకితం : ఎమ్మెల్యే సీతక్క

ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజాసేవకే అంకితమవుతానని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. ములుగులో జరిగిన కార్నర్స్ మీటింగ్​లో సీతక్క మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి కుటుంబాల్లో ఒకరినై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కొట్లాడుతున్నానన్నారు. ఆ అభిమానమే ఈ సభలో కనిపిస్తోందని ఉద్వేగంగా అన్నారు. కాంగ్రెస్ పేదల కోసమే పనిచేస్తుందని అలాంటి పార్టీని నడిపిస్తున్న అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోరాటానికి మద్దతు తెలుపుతూ అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సీతక్క పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.