గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదు

గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదు

హైదరాబాద్: కేసీఆర్ రాజకీయ జీవితం ఓటమితో మొదలైందనే విషయాన్ని ఆయన తనయుడు కేటీఆర్ తెలుసుకోవాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ డిక్లరేషన్ సభలో  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయగా... వాటికి కౌంటర్ గా మంత్రి కేటీఆర్ రాహుల్ పై విరుచుకుపడ్డారు. రాహుల్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఖండించారు. గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ... గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా... వేరే వ్యక్తులకు అవకాశం కల్పించారన్నారు. కానీ.. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలో దళితుడైన భట్టి విక్రమార్క ప్రతి పక్ష నాయకుడిగా ఉంటే ఓర్వలేక... కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. ముల్కి నిబంధనల ప్రకారం కేటీఆర్ కు రాష్ట్రంలో చెప్రాసీ ఉద్యోగం కూడా రాదని అన్నారు. 

పారిపోయే చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిదేనన్న ఆయన... కేసీఆర్ సిద్ధిపేట నుంచి కరీంనగర్ కు, అక్కడి నుంచి మహబూబ్ నగర్ కు... అక్కడి నుంచి గజ్వేల్ కు పారిపోయారని అన్నారు. కేసీఆర్ వెళ్లి శరత్ పవార్, స్టాలిన్ , మమతాబెనర్జీ లను కలవొచ్చు.. రాహుల్ గాంధీ వస్తే టూరిస్ట్ అంటారా అని నిలదీశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ సభతో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నాయకుల్లో గుబులు మొదలైందన్న రేవంత్... కలుగులోని ఎలుకల్లా బయటకి వచ్చి... వారంతా రాహుల్ ను విమర్శించే పనిలో పడ్డారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమరవీరుల స్థూపాన్ని అద్భుతంగా నిర్మిస్తామని, యాదగిరి గుట్ట, అమరవీరుల స్థూప నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతామని స్పష్టం చేశారు.