కాంగ్రెస్ వార్ రూం కేసులో విచారణకు మల్లు రవి

కాంగ్రెస్ వార్ రూం కేసులో విచారణకు మల్లు రవి

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విచారణకు హాజరు కానున్నారు.  ఉదయం 11 గంటలకు  బషీర్ బాగ్లోని సీసీఎస్ కార్యాలయానికి విచారణకు రానున్నారు.   సీఎం కేసీఆర్ తో పాటు  రాష్ట్ర ప్రభుత్వంపై అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు జనవరి 11న  కేసు నమోదు చేశారు. సునీల్ కనుగోలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కాంగ్రెస్ వార్ రూం కేసులో  మల్లు రవిని ఏ5గా నిందితుడిగా చేర్చారు. కాంగ్రెస్ వార్ ఇంఛార్జ్ మల్లు రవి అని సునీల్ కనుగోలు చెప్పడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.  


సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో 2022  నవంబర్ 24న మాదాపూర్ లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సునీల్ కనుగోలుతో పాటు  మెండా శ్రీప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఇచ్చిన వివరాలు ఆధారంగా  సునీల్ కనుగోలును కాంగ్రెస్ వార్ రూం కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చారు.  సునీల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా.. సీఆర్పీసీ 41 A కింద మల్లు రవికి నోటీసులు అందజేశారు.