దేవుడి దగ్గర రాజకీయాలా?.. మేం తిరుమలకు రావొద్దా?

దేవుడి దగ్గర రాజకీయాలా?.. మేం తిరుమలకు రావొద్దా?

హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. జలవివాదాలతో కేసీఆర్, జగన్‌లు ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. మళ్లీ ఉద్యమ సమయం నాటి పరిస్థితులను తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకోకుండా వివాదాన్ని పెద్దది చేస్తున్నారని విమర్శించారు. 

‘జలవివాదాన్ని కేసీఆర్, జగన్‌లు కావాలనే పెద్దది చేస్తున్నారు. మంత్రులు కూడా ఇష్టానుసారం మాట్లాడుతూ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. కేసీఆర్ జగన్ ఇద్దరు రాజకీయ ప్రయోజనాల కోసం జల రగడను పెద్దది చేస్తున్నారు. ప్రజలు కరోనా కష్టాలతో బాధపడుతుంటే.. ఆ ఇష్యూను పక్కదోవ పట్టించడానికి జల వివాదాన్ని వాడుకుంటున్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి అందరివాడు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతి లేదని టీటీడీ అధికారులు చెప్పడం సరికాదు. ఇలాంటి వివాదాలు పెరిగితే రాబోయే రోజుల్లో పెద్ద తుఫాన్‌గా మారుతుంది. దేవుడి వద్ద కూడా రాజకీయాలా? తెలంగాణ భక్తులు తిరుమలకు రావొద్దా ఇది దుర్మార్గం. ఇలాంటి ఇష్యూలు పెంచడం ఇద్దరు సీఎంలు మంచిది కాదు. ఇలాంటి వివాదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఇద్దరు సీఎంలపై ఉంది’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.