ట్రాక్.. హంట్.. కిల్.. హమాస్​ మిలిటెంట్ల ఏరివేతకు ఇజ్రాయెల్​ ప్లాన్​

ట్రాక్.. హంట్.. కిల్..  హమాస్​ మిలిటెంట్ల ఏరివేతకు ఇజ్రాయెల్​ ప్లాన్​
  •     మొసాద్​కు నెతన్యాహు ఆర్డర్​
  •     ‘వాల్​స్ట్రీట్​ జర్నల్’ లో కథనం

ఖాన్​యూనిస్(గాజా) :  గాజాపై యుద్ధాన్ని విరమించినా హమాస్​ కీలక నేతలను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే ప్లాన్ ​రెడీ చేసుకుందని ప్రముఖ పత్రిక ‘వాల్​స్ట్రీట్ ​జర్నల్’ ఓ స్టోరీ రాసింది. ప్రధాని బెంజమిన్‌‌‌‌‌‌‌‌ నెతన్యాహు.. మాజీ ప్రధాని గోల్డా మెయిర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని అందులో పేర్కొంది. అప్పట్లో  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ శత్రువులను అంతం చేసేందుకు గోల్డా మెయిర్‌‌‌‌‌‌‌‌  ‘ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ రేత్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ గాడ్‌‌‌‌‌‌‌‌’ చేపట్టారు. తాజాగా నెతన్యాహు కూడా వివిధ దేశాల్లోని హమాస్‌‌‌‌‌‌‌‌ కీలక నేతలను ఏరివేసేలా తమ నిఘా సంస్థ మొసాద్‌‌‌‌‌‌‌‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని, రూట్‌‌‌‌‌‌‌‌ మ్యాప్‌‌‌‌‌‌‌‌ కూడా సిద్ధమైందని సమాచారం. హమాస్‌‌‌‌‌‌‌‌లో కీలక నేతలు ఎవరు? వాళ్లు ఏయే దేశాల్లో ఉంటున్నారు? తదితర వివరాలు ఇప్పటికే నెతన్యాహు దగ్గర ఉన్నట్లు వాల్​స్ట్రీట్​ జర్నల్​ పేర్కొంది. వాళ్లను మట్టుబెట్టేందుకు ‘ట్రాక్‌‌‌‌‌‌‌‌.. హంట్.. కిల్‌‌‌‌‌‌‌‌’ అనే సూత్రాన్ని ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ పాటిస్తున్నట్లు సమాచారం. ​హిట్​లిస్ట్​లోని హమాస్ ​కీలక నేతల్లో పాలస్తీనా మాజీ ప్రధాని ఇస్మాయిల్‌‌‌‌‌‌‌‌ హనియే, హమాస్‌‌‌‌‌‌‌‌ మిలటరీ విభాగం అధ్యక్షుడు మహ్మద్‌‌‌‌‌‌‌‌ డెయిఫ్‌‌‌‌‌‌‌‌, బ్రిగేడ్స్‌‌‌‌‌‌‌‌ కమాండర్‌‌‌‌‌‌‌‌ యహ్యా సిన్వార్‌‌‌‌‌‌‌‌, పొలిట్‌‌‌‌‌‌‌‌ బ్యూరో సభ్యుడు ఖలేద్‌‌‌‌‌‌‌‌ మషల్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

పెరిగిన మరణాలు

యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్య15,200 దాటిందని, వారిలో 70% మంది మహిళలు, పిల్లలే ఉన్నారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. దాదాపు 40 వేల మందికి పైగా గాయపడినట్లు పేర్కొంది. దాదాపు 20 లక్షల గాజా జనాభా మొత్తం దక్షిణాన కేంద్రీకృతమై ఉంది. యుద్ధం ప్రారంభంలో ప్రజలను అక్కడి నుంచి మకాం మార్చాలని ఇజ్రాయెల్​కోరింది. కానీ ఉత్తర గాజా లేదా పొరుగున ఉన్న ఈజిప్ట్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లడం కుదరక అక్కడే ఉండిపోయారు. దీంతో మరణాల సంఖ్య పెరిగింది.

రెండో రోజూ దాడులు..

ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ -హమాస్‌‌‌‌‌‌‌‌ మధ్య సంధి గడువు ముగిసిన రెండో రోజూ గాజాలో దాడులు కొనసాగాయి. శనివారం దక్షిణ గాజాపై ఇజ్రాయెల్​తన దాడిని మరింత​తీవ్రతరం చేసింది. శుక్రవారం నుంచి దాడులు మళ్లీ మొదలైన తర్వాత కనీసం 178 మంది పాలస్తీనియన్లు చనిపోయారు.  హమాస్‌‌‌‌‌‌‌‌ తొలుత ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌  వైమానిక, భూతల దాడులకు దిగింది. దీంతో బందీల విడుద ల ఆగిపోయింది. కాల్పుల విరమణ కోసం కుదిరిన ఒప్పందం నిలిచిపోవడానికి హమాస్ చర్యలే కారణమని అమెరికా నిందించింది.