యూఎస్‌‌‌‌‌‌, ఇండియా మధ్య పెరుగుతున్న వాణిజ్యం

యూఎస్‌‌‌‌‌‌, ఇండియా మధ్య పెరుగుతున్న వాణిజ్యం
  • 2022‑23 లో 128.55 బిలియన్ డాలర్లకు 28 బిలియన్ డాలర్ల మిగులు
  • చైనాతో 99 బిలియన్ డాలర్లకు చేరిన వాణిజ్య లోటు 
  • 3, 4  ప్లేస్‌‌లలో యూఏఈ, సౌదీ..

న్యూఢిల్లీ:యూఎస్‌‌‌‌‌‌, ఇండియా మధ్య వాణిజ్యం పెరుగుతోంది.2022–23 ఆర్థిక సంవత్సరంలో  ఇండియాకు అతిపెద్ద   వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. కామర్స్ మినిస్ట్రీ విడుదల చేసిన డేటా ప్రకారం, ఇండియా, యూఎస్ మధ్య బిజినెస్‌ కిందటి ఆర్థిక సంవత్సరంలో 128.55 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రికార్డయిన 119.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే 7.65 శాతం వృద్ధి సాధించింది.  2020–21 లో ఇరు దేశాల మధ్య 80.51 బిలియన్ డాలర్ల వాణిజ్యం  జరిగింది. యూఎస్‌‌‌‌కు చేసిన ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 2.81 శాతం వృద్ధి సాధించి 78.31 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇది 76.18 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు యూఎస్ నుంచి ఇండియాకు అవుతున్న దిగుమతుల విలువ 16 శాతం పెరిగి 50.24 బిలియన్ డాలర్లకు చేరుకుంది.  ఇండియాకు వాణిజ్య మిగులు ఉన్న కొన్ని దేశాల్లో యూఎస్‌‌‌‌  కూడా ఉంది. 2022-–23 లో 28 బిలియన్ డాలర్ల  మిగులు నమోదయ్యింది. 

చైనాతో తగ్గింది..

మరోవైపు చైనాతో జరుగుతున్న వాణిజ్యం కిందటి ఆర్థిక సంవత్సరంలో కొద్దిగా తగ్గింది.  2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇండియా–చైనా మధ్య వాణిజ్యం ఏడాది ప్రాతిపదికన 1.5 శాతం తగ్గి 113.83 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 115.42 బిలియన్ డాలర్లుగా ఉంది. చైనాకు చేస్తున్న ఎగుమతులు ఏకంగా 28 శాతం పడిపోయాయి.  కానీ, ఈ దేశం నుంచి జరుపుకుంటున్న దిగుమతులు మాత్రం 4.16 శాతం పెరిగాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో చైనాకు జరిపిన ఎగుమతులు 15.32 బిలియన్ డాలర్లుగా, ఈ దేశం నుంచి జరిగిన దిగుమతులు 98.51 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. దీంతో  చైనాతో ఇండియా వాణిజ్య లోటు 83.2 బిలియన్ డాలర్లకు  చేరుకుంది. 2021–22 లో ఇది 72.91 బిలియన్ 
డాలర్లుగా ఉంది.

యూఎస్‌‌‌‌‌‌తో మరింత బలపడుతూ..

ఇండియా, యూఎస్‌‌‌‌ మధ్య వాణిజ్యం మరింత బలపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫార్మాస్యూటికల్స్‌‌‌‌, ఇంజినీరింగ్‌‌‌‌, జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్రొడక్ట్‌‌‌‌లు యూఎస్‌‌‌‌కు ఎక్కువగా ఎగుమతయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌‌‌‌పోర్ట్ ఆర్గనైజేషన్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఐఈఓ) ప్రెసిడెంట్  శక్తివేల్‌‌‌‌ అన్నారు. ఇండియా–యూఎస్ మధ్య వాణిజ్యం రానున్న నెలల్లో మరింత బలపడుతుందని చెప్పారు. ‘గ్లోబల్‌‌‌‌ కంపెనీలకు ఇండియా నమ్మదగ్గ ట్రేడింగ్ పార్టనర్‌‌‌‌‌‌‌‌గా మారింది. కంపెనీలు సప్లయ్స్‌‌‌‌ కోసం పూర్తిగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇండియా వంటి దేశాలపై ఆధారపడుతూ తమ బిజినెస్‌‌‌‌లను డైవర్సిఫై చేసుకుంటున్నాయి’ అని ఎఫ్‌‌‌‌ఐఈఓ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ ఖలీద్‌‌‌‌ ఖాన్ అన్నారు.  ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కన్జూమర్ మార్కెట్‌‌‌‌ కావడం,  ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతుండడంతో  వాణిజ్యానికి యూఎస్‌‌‌‌కు ఇండియాలో బోలెడు అవకాశాలు ఉన్నాయని  ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ (ఐఐపీఎం) డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ రాకేష్‌‌‌‌ మోహన్ జోషి అన్నారు.‘ పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌లు, పాలిష్ చేసిన డైమండ్స్‌‌‌‌, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌‌‌‌లు, జ్యువెలరీ, లైట్ ఆయిల్స్ అండ్ పెట్రోలియం, గడ్డకట్టిన రొయ్యలు వంటివి  ఇండియా నుంచి యూఎస్‌‌‌‌కు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. క్రూడ్‌‌‌‌ పెట్రోలియం, రఫ్ డైమండ్స్‌‌‌‌,  లిక్విఫైడ్‌‌‌‌ నేచురల్ గ్యాస్‌‌‌‌, గోల్డ్‌‌‌‌, బొగ్గు , ఆల్మండ్స్‌‌‌‌ వంటివి  యూఎస్‌‌‌‌ నుంచి ఇండియా ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది’ అని జోషి వివరించారు. కాగా, 2013–14 నుంచి 2017–18 మధ్య, ఇంకా 2020–21 లో ఇండియాకు అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్‌‌‌‌‌‌‌‌గా చైనా నిలిచింది. అంతకు ముందు యూఏఈ అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్‌‌‌‌‌‌‌‌గా ఉంది. 2022–23 లో ఇండియా, యూఏఈ మధ్య 76.16 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఈ దేశం ఇండియాకు మూడో అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్‌‌‌‌‌‌‌‌గా ఉంది. 52.72 బిలియన్ డాలర్లతో  నాలుగో ప్లేస్‌‌‌‌లో సౌదీ అరేబియా, 35.55 బిలియన్ డాలర్లతో ఐదో ప్లేస్‌‌‌‌లో సింగపూర్ ఉన్నాయి.