సింగరేణిలో సమ్మె పాక్షికం.. డ్యూటీలకు హాజరైన మెజార్టీ కార్మికులు

సింగరేణిలో సమ్మె పాక్షికం.. డ్యూటీలకు హాజరైన మెజార్టీ కార్మికులు

కోల్​బెల్ట్/నస్పూర్/జైపూర్, వెలుగు: దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మె, భారత్​బంద్​ప్రభావం సింగరేణి బొగ్గు గనులపై పాక్షికంగా కనిపించింది. శుక్రవారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని మందమర్రి, శ్రీరాంపూర్​, బెల్లంపల్లి ఏరియాల్లోని సింగరేణి బొగ్గు గనులకు  70శాతానికి పైగా కార్మికులు విధులు హాజరుకావడంతో బొగ్గు ఉత్పత్తికి పెద్దగా విఘాతం కలగలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బొగ్గు గనులపై ఆయా కార్మిక సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి ఆటంకాలు కలగకపోవడంతో సింగరేణి యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. 

గనులపై ఆందోళనలు, నిరసనలు

బొగ్గు గనులపై ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలుపగా సీఐటీయూ, హెచ్ఎంఎస్​సమ్మె విజయవంతం కోసం ప్రయత్నించాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఆపాలని, బొగ్గు బ్లాక్​ల వేలం విధానం రద్దు చేయాలని, సింగరేణికి బొగ్గు బ్లాక్​లు కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మందమర్రి మార్కెట్​లోని అంబేద్కర్​ విగ్రహం వద్ద కోల్​బెల్ట్ రహదారిపై, సోమగూడెం ప్రధాన రహదారిపై ఏఐటీయూసీ, సీపీఐ లీడర్లు, కార్యకర్తలు ర్యాలీ, రాస్తారోకో చేశారు. సీఐటీయూ అనుబంధ కాంట్రాక్ట్​కార్మిక సంఘం ఆధ్వర్యంలో మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఆఫీస్​ఎదుట ధర్నాకు దిగారు.

శ్రీరాంపూర్​ ఏరియాలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం, సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్( సీఐటీయూ ) ఆధ్వర్యంలో  సీఐటీయూ ఆఫీస్​ నుంచి శ్రీరాంపూర్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి​ ఏరియాల్లోని బొగ్గు గనులపై ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ లీడర్లు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్​వద్ద హెచ్ఎంఎస్​ అనుబంధ కాంట్రాక్ట్​ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెకు సంపూర్ణ మద్దతు పలికారు. ఆందోళనలో లీడర్లు సెలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్, భీమనాథుని సుదర్శనం, చిప్ప నర్సయ్య, కంది శ్రీనివాస్, బోగే ఉపేందర్, ఎస్.వెంకటస్వామి, దూలం శ్రీనివాస్​, కస్తురి చంద్రశేఖర్, దుంపల రంజిత్, బాలాజీ, సుధాకర్,  జీవన్​జోయల్, విక్రమ్, ప్రదీప్​రెడ్డి, సాయికృష్ణారెడ్డి, చిప్పకుర్తి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

బొగ్గు గనులపై ఉదయం నుంచి టెన్షన్

మందమర్రి, శ్రీరాంపూర్​, బెల్లంపల్లి ఏరియాల్లోని ఓపెన్​కాస్ట్, అండర్​గ్రౌండ్ మైన్ల వద్ద ఉదయం టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్మికులు డ్యూటీలకు హాజరవుతారా? లేదా? అనే పరిస్థితి ఏర్పడింది. అయితే మెజారిటీ కార్మికులు గనులపైకి రావడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ముందస్తుగా బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగకుండా సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా బెల్లంపల్లి రీజియన్​లోని శ్రీరాంపూర్​ ఓసీపీ, ఇందారం ఓసీపీ, ఆర్కేపీ ఓసీపీ, కళ్యాణిఖని ఓసీపీ, ఖైరీగుడా ఓసీపీలను నడిపించేందుకు చర్యలు చేపట్టింది.

మందమర్రి ఏరియాలోని కాసీపేట, కాసీపేట-2 బొగ్గు గనుల్లో  కేవలం20 శాతం లోపు కార్మికులే ఫస్ట్, జనరల్​షిప్టులకు హాజరయ్యారు. కేకే ఓసీపీలోని ఓబీ కంపెనీలోని కాంట్రాక్ట్​కార్మికులు చాలాసేపు విధులకు దూరంగా ఉన్నారు. మూడు ఏరియాల జీఎంలు మనోహర్, సంజీవరెడ్డి, రవిప్రసాద్​గనులపై తిరుగుతూ సమ్మె ప్రభావంపై ఆరా తీశారు.