హైదరాబాద్,వెలుగు: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ట్రాఫిక్ అడిషనల్ సీపీ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రాణహాని కలిగించే విధంగా ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, ట్రిపుల్ రైడింగ్ చేసే వాహనదారులపై కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. సైఫాబాద్ ట్రాఫిక్ కాంప్లెక్స్‌లో డీసీపీలు,ఏసీపీలు,ఇన్‌స్పెక్టర్లతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. పెండింగ్ చలాన్లపై ఇచ్చిన ఆఫర్ ఈ నెల 31తో ముగుస్తుండడంతో ఏప్రిల్ 1 నుంచి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 50 కంటే ఎక్కువ వయొలేషన్స్ చేసిన వాహనదారులపై చార్జి షీట్ ఫైల్ చేయాలన్నారు. ఇలాంటి వెహికల్స్‌పై ఉన్న పాత చలాన్లను లెక్కలోకి తీసుకోవాలని చెప్పారు. వెహికల్ స్టిక్కర్స్, నంబర్ ప్లేట్స్, మల్టీట్యూన్డ్, ఎయిర్ హారన్స్‌ను నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.
