20లక్షల చలాన్లు.. 96 కోట్ల ఫైన్..

20లక్షల చలాన్లు.. 96 కోట్ల ఫైన్..

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ ఏడాది ఆన్లైన్లో 20,96.961 చలాన్స్  వేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. చలాన్ల విలువ రూ.96కోట్ల 64 లక్షలని అన్నారు.  6,08,000 స్పాట్ చలాన్లు విలువ రూ.24కోట్ల 91 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది 57,175 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదుకాగా..  979 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో  రూ.15 కోట్ల 76లక్షల ఫైన్ వేయడంతో పాటు 32,238 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. 

తగ్గిన క్రైం రేట్

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైం రేట్ 12శాతం తగ్గిందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ప్రాపర్టీకి సంబంధించిన నేరాలు 28శాతం తగ్గాయని చెప్పారు. ఏడాదిలో డయల్ 100కు 2,36,417 కాల్స్ వచ్చాయని ప్రకటించారు. ఈ ఏడాది 79 మందిపై పీడీ యాక్ట్ నమోదుచేయడంతో పాటు 13 మందిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేసినట్లు వెల్లడించారు. గతేడాది మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 2,363 కేసులు నమోదుకాగా.. ఈసారి 2,166 కేసులకు పరిమితమయ్యాయని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. చీటింగ్ కేసులు మాత్రం 15 శాతం, సైబర్ నేరాలు 25శాతం పెరిగాయని వెల్లడించారు. ఈ ఏడాది 185 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.