ఉప్పల్ స్టేడియం వద్ద 21 చోట్ల పార్కింగ్

ఉప్పల్ స్టేడియం వద్ద 21 చోట్ల పార్కింగ్

హైదరాబాద్: భారత్–ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నేపథ్యంలో ఈనెల  25న ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. వాహనదారుల కోసం మొత్తం 21 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని, ఒక్కో పార్కింగ్ లో 1400 ఫోర్ వీలర్ వాహనాలు పట్టేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. గేట్ నెంబర్ 1  వద్ద వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 5 మొబైల్ పార్కింగులు ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీ వాహనాల పార్కింగ్ కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించామని చెప్పారు. 

ఏక్ మినార్ వద్ద ఎవరూ కూడా పార్కింగ్ చేయొద్దని, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. స్టేడియానికి వచ్చే వాహనాల తనిఖీ కోసం 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఎక్కడైనా వాహనాలు చిక్కుకుపోతే తీయడానికి 5 క్రేన్లను కూడా అందుబాటులో ఉంచామని ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.