అక్టోబర్ 28న సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు.. యూసఫ్ గూడ మీదుగా వెళ్లేవారు ఇలా వెళ్లండి..!

అక్టోబర్ 28న  సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు.. యూసఫ్ గూడ మీదుగా వెళ్లేవారు ఇలా వెళ్లండి..!

 హైదరాబాద్​సిటీ, వెలుగు: తెలుగు సినీ పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య సమావేశం మంగళవారం యూసుఫ్​గూడలోని పోలీసు గ్రౌండ్స్​లో జరుగనున్న నేపథ్యంలో.. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో  ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు  ట్రాఫిక్​ డైవర్షన్లు ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు.  మైత్రీవనం జంక్షన్ నుంచి యూసుఫ్‌ గూడ బస్తీ, రహ్మత్​నగర్, కార్మికనగర్, బోరబండ బస్ స్టాప్ వైపు వెళ్లే ట్రాఫిక్​ను యూసుఫ్‌గూడ బస్తీ వద్ద కృష్ణకాంత్ పార్క్, -జీటీఎస్ టెంపుల్, -కల్యాణ్ నగర్, -మోతీ నగర్-, బోరబండ బస్ స్టాప్ వైపు మళ్లిస్తారు.  

మైత్రీవనం జంక్షన్ నుంచి యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్ వైపు వెళ్లే ట్రాఫిక్​ను యూసుఫ్‌గూడ బస్తీ వద్ద ఆర్‌బీఐ క్వార్టర్స్-, కృష్ణ నగర్ జంక్షన్, -జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వైపు డైవర్ట్  చేస్తారు.  జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ , వెంకటగిరి నుంచి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం వైపు వెళ్లే ట్రాఫిక్​ను కృష్ణానగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ, -పంజాగుట్ట వైపు డైవర్ట్​చేస్తారు.

బోరబండ బస్ స్టాప్ నుంచి కార్మిక నగర్, రహ్మత్​నగర్, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్రైమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద శ్రీ రామ్ నగర్ ఎక్స్ రోడ్స్ వైపు మిడ్‌ల్యాండ్ బేకరీ-, జీటీఎస్ కాలనీ-కళ్యాణ్ నగర్ జంక్షన్, -వెంగళరావు నగర్-, ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర యూ-టర్న్-తీసుకుని మళ్లీ ఐసీఐసీఐ దగ్గర యూ-టర్న్ తీసుకుని -మైత్రీవనం జంక్షన్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.