మెహిదీపట్నంలో స్కైవాక్ నిర్మాణం.. ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్

మెహిదీపట్నంలో స్కైవాక్ నిర్మాణం.. ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్

ట్రాఫిక్ నియంత్రణ, పాదచారుల సౌకర్యం కోసం హైదరాబాద్ సిటీలో స్కైవాక్ ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఉప్పల్ మాదిరిగానే మెహిదీపట్నంలోనూ స్కైవాక్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్న క్రమంలో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. మెహిదీపట్నం రైతు బజార్, బస్టాప్ ఏరియాల్లో నిర్మిస్తున్న స్కైవాక్ కారణంగా ట్రాఫిక్ డైవర్షన్ వివరాలను వెల్లడించారు ట్రాఫిక్ పోలీసులు. 

ఏప్రిల్ 10, 11 తేదీలలో అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. మాసబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ (NMDC), ఎస్ డీ ఐ హాస్పిటల్ (SD Eye Hospital)  నుంచి రేతిబౌలి, ననల్ నగర్ వైపు వచ్చే ట్రాఫిక్ ను  అజీజియా మసీదు సమీపంలోని పీవీఎన్ఆర్ (PVNR) ఎక్స్ ప్రెస్ వే 2, 3వ పిల్లర్ల దగ్గర మళ్లిస్తున్నారు. వాహనాలను మెరాజ్ కేఫ్ మీదుగా మళ్లించి, 15వ పిల్లర్ వద్ద మెహదీపట్నం వైపు రైట్ (కుడి మలుపు) తీసుకుని, ఆ తర్వాత రెగ్యులర్ రూట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.

ట్రాఫిక్ అడ్వైజరీ:

మెహదీపట్నం స్కైవాక్ నిర్మాణ పనుల కారణంగా ప్రకటించిన డైవర్షన్స్ కు సంబంధించి వాహనదారులకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్‌లోని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా, X లోని HYDTP హ్యాండిల్ ద్వారా ట్రాఫిక్ హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో  9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని చెపపారు. 

Also Read : హైదరాబాద్ లో వందల ఎకరాల భూ కబ్జా

నిర్మాణ పనుల సమయంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి సహకరించాలని కోరారు. వాహనదారులు డైవర్షన్స్ గమనించి, తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించి..  ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు.