హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: ఇవాళ ( జూన్ 8 ) నాంపల్లి రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: ఇవాళ ( జూన్ 8 ) నాంపల్లి రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు
  • నాంపల్లి పరిసరాల్లో వాహనాల మళ్లింపు
  • నేడు ఉదయం 6 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు అమలు

నాంపల్లి, వెలుగు: చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలులో ఉంటాయని హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ తెలిపారు. కార్లలో వచ్చే వారు తమ వాహనాలను గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్ ప్రాంతాల్లో పార్క్ చేసి అక్కడి నుంచి కాలినడకన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గేట్ నంబర్-2 వద్దకు చేరుకోవాలి. బస్సులు, వ్యాన్లలో వచ్చే వారు గాంధీ భవన్ లేదా గృహకల్ప బస్‌‌‌‌స్టాప్‌‌‌‌ల వద్ద దిగాల్సి ఉంటుంది. 

టూ వీలర్లకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆటోల్లో వచ్చే వారు షెజాన్ హోటల్ ఎదురుగా దిగాలని పోలీసులు సూచించారు. వీఐపీ కార్ పాస్ హోల్డర్ల కోసం ప్రత్యేక ప్రవేశం, పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. ఫుడ్​ ఐటమ్స్​ తీసుకువచ్చే స్వచ్ఛంద సంస్థల వాహనాలు, చేపలను తరలించే మత్స్యశాఖ వాహనాలు, నీటి ట్యాంకర్లకు గేట్ నంబర్-3 ద్వారా ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ మళ్లింపుల్లో భాగంగా ఎం.జె.మార్కెట్ వైపు నుంచి వచ్చే వాహనాలను అబిడ్స్, జీపీఓ, నాంపల్లి మార్గాల వైపు మళ్లించనున్నారు. 

అలాగే ఎం.జె.బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి ప్రాంతాల నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్ వద్ద దారుస్సలాం, ఏక్‌‌‌‌మినార్ తదితర మార్గాల వైపు దారి మళ్లిస్తారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, భారీ వాహనాలకు ఎం.జె.మార్కెట్–తాజ్ ఐలాండ్ మార్గంలో అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌‌‌‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

అన్నదాన సేవలకు ఏర్పాట్లు..

చేప ప్రసాదం కోసం ఇప్పటికే హైదరాబాద్‌‌‌‌కు చేరుకున్న భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదాన సేవలు అందిస్తున్నాయి. బసవ కేంద్ర చార్కామన్ సంఘం, అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు ఈ సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత 26 ఏళ్లుగా నిరంతరంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎంతమంది వచ్చినా భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు:   మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు ఈ నెల 8, 9 తేదీల్లో పంపిణీ చేయనున్న చేప ప్రసాదం కోసం వచ్చే భక్తుల కోసం టీజీఎస్‌‌‌‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ, జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్), నాంపల్లి రైల్వే స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్), ఈసీఐఎల్ క్రాస్‌‌‌‌రోడ్స్, శంషాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 44 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 

అలాగే నగరంలోని ప్రధాన డిపోల నుంచి దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్, ఎన్‌‌‌‌జీవో కాలనీ, మిధాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రామ్‌‌‌‌నగర్, రాజేంద్రనగర్, రిసాలాబజార్, పటాన్‌‌‌‌చెరు, జీడిమెట్ల, కేపీహెచ్‌‌‌‌బీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి 80 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.