- కోర్టు స్టేతో రెండు చోట్ల ఆగిన పనులు
- భూసేకరణ, పరిహారం విషయంలో పెండింగ్
- పట్టణానికి తీరని ట్రాఫిక్ సమస్య
- త్వరగా పరిష్కరించాలని ప్రయాణీకుల విజ్ఞప్తి
సిద్దిపేట/ గజ్వేల్, వెలుగు : సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఐదేండ్ల తర్వాత పనుల్లో పురోగతి సాధించినా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. భూసేకరణ, పరిహారం విషయంలో కోర్టు స్టేతో రెండు చోట్ల పనులు ఆగాయి. ఈ పరిస్థితుల్లో గజ్వేల్ పట్టణానికి ట్రాఫిక్ సమస్యలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఈ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వస్తే చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండకు వెళ్లే భారీ సరకు రవాణా వాహనాలు గజ్వేల్ పట్టణంలోకి వచ్చే అవకాశం ఉండదు.
రింగ్ రోడ్డు మూలంగా గజ్వేల్ పట్టణం నుంచి తొమ్మిది మార్గాలకు కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉన్నా ఆ రెండు చోట్ల పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం ఏడు మార్గాల్లోనే కనెక్టివిటీ లభిస్తోంది.
2017లో షురూ..
గజ్వేల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు రిమ్మనగూడ సమీపంలోని రాజీవ్ రాహదారి నుంచి 22 కిలో మీటర్ల మేర రూ.220 కోట్లతో 2017లో ప్రారంభించారు. మొదట 30 మీటర్ల వెడల్పుతో రింగ్ రోడ్డును నిర్మించాలని భావించినా తర్వాత డిజైన్ ను మార్చారు. వంద ఫీట్ల వెడల్పుతో ఫోర్ లేన్ రోడ్డుగా మార్పు చేసి 209 ఎకరాల భూమిని సేకరించారు. భూసేకరణ సమస్య కారణంగా చాలా రోజులు పనులు నత్తనడకన సాగాయి.
ఈసారి ఎన్నికల నేపథ్యంలో అధికారులు భూములు కోల్పోతున్నవారితో మాట్లాడి రాజీవ్ రహదారిని ఆనుకుని పెండింగ్లో ఉన్న ఏడు కిలో మీటర్ల మేర బైపాస్ రోడ్డును ఇటీవల అందుబాటులోకి తెచ్చారు. ఇక రెండు చోట్ల మాత్రం సమస్య పరిష్కారం కాక పనులు ఆగిపోయాయి.
ఇదీ సమస్య...
గజ్వేల్రింగ్ రోడ్డు పూర్తయ్యేందుకు రెండు చోట్ల భూసేకరణ, పరిహారాల విషయంలో సమస్య వచ్చింది. దౌల్తాబాద్, చేగుంట మధ్య ధర్మారెడ్డిపల్లి వద్ద రైల్వే శాఖ ఆధ్వర్యంలో 1.6 కిలో మీటర్ల మేర రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నండగా ఇక్కడ భూసేకరణకు సంబంధించి ఏర్పడిన వివాదంతో పనులు ముందుకు కదలడం లేదు. గజ్వేల్–వర్గల్ రోడ్డులో పరిహారం విషయంలో కోర్టు స్టే కారణంగా 100 మీటర్ల మేర రోడ్డు పనులు నిలిచిపోయాయి.
ఈ రెండు చోట్ల పనులు ఆగడంతో సిద్దిపేట, భువనగిరి, పాతూరు నుంచి తుఫ్రాన్ కు వెళ్లేవారు తప్పనిసరిగా గజ్వేల్ పట్టణం నుంచి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పెండింగ్ పనులు పూర్తయితే గజ్వేల్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలో త్వరగా సమస్యను పరిష్కరించాలని ప్రయాణీకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
మూడు బ్రిడ్జిలు.. ఏడు సర్కిళ్లు
22 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్న గజ్వేల్ రింగ్ రోడ్డులో మొత్తం మూడు బ్రిడ్జిలు, ఏడు సర్కిళ్లను ఏర్పాటు చేశారు. రాజీవ్‌రహదారి పక్క నుంచి ఏడు కిలో మీటర్ల బైపాస్ రోడ్డు ఆరు లైన్లుగా 150 ఫీట్ల వెడల్పుతో, మిగతా 15 కిలో మీటర్లను 100 ఫీట్లతో ఫోర్ లేన్ రోడ్డును నిర్మించారు.
త్వరలో పెండింగ్ పనులు చేపడుతాం..
గజ్వేల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మిగిలిపోయిన పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. కోర్టు స్టే కారణంగా కొన్ని చోట్ల పనులను ఆపాల్సి వచ్చింది. కోర్టు అనుమతితో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. దౌల్తాబాద్ చేగుంట మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను రైల్వే శాఖ చేపట్టింది.
- రామకృష్ణ, డీఈ ఆర్ అండ్ బీ