అమిత్ షా టూర్.. ట్రాఫిక్ ఆంక్షలు

అమిత్ షా టూర్.. ట్రాఫిక్ ఆంక్షలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సైబరాబాద్ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్‌ నుంచి మోయినాబాద్‌, చేవెళ్ల మీదుగా వికారాబాద్‌ వెల్లే వాహనాలను రోటరీ-1 టీఎస్‌పీఏ వద్ద దారిమళ్లిస్తారు. 

 ట్రాఫిక్ ఆంక్షలు

 చేవెళ్ల బహిరంగ సభకు బీజేపీ నేతలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. హైదరాబాద్ కు దగ్గరగా ఈ సభ జరుగనుండటంతో  నగరం నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో చేవెళ్లకు రానున్నారు. కాబట్టి సర్వీసు రోడ్డు మీదుగా నార్సింగి, జన్వాడ-శంకర్‌పల్లి, పర్వేద ఎక్స్‌రోడ్‌ నుంచి వికారాబాద్‌ వైపులో ట్రాఫిక్ అంక్షలు ఉంటాయి. ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

12 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు..

మరోవైపు చేవెళ్ల బీజేపీ విజయ సంకల్ప సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభ కోసం 12 కమిటీలను ఏర్పాటు చేశామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవెందర్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 2,789 పోలింగ్ బూత్ ల నుంచి కార్యకర్తలు, కమిటీ సభ్యులు సభకు హాజరు కానున్నారని చెప్పారు. సభకు వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

అమిత్ షా షెడ్యూల్..

కేంద్ర హోమంత్రి అమిత్ షా సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కి వెళ్తారు.అనంతరం 4.30కి బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తారు. ఆ తర్వాత 5 గంటల 15 నిమిషాలకు  చేవెళ్ల సభకు వెళ్లి ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటల వరకు సభలోనే ఉండనున్న అమిత్ షా...రాత్రి 7.45కి తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.