న్యూ ఇయర్ ​వేడుకల్లో విషాదం.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

న్యూ ఇయర్ ​వేడుకల్లో విషాదం.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
  • పాలమూరు జిల్లా మిడ్జిల్, నవాబుపేటల్లో ఇద్దరు
  • సంగారెడ్డి జిల్లాలో ఇంజినీరింగ్ ​విద్యార్థులు
  • జగిత్యాల జిల్లా కేంద్రంలో మహిళ
  • సూర్యాపేటలో సీలింగ్​ వర్కర్ ​దుర్మరణం

నూతన సంవత్సరం కొందరి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సంబురాలు చేసుకోవడానికి వెళ్తున్న కొందరు, వేడుకలు చేసుకుని ఇంటికి వెళ్తున్న మరికొందరు అనుకోని ప్రమాదాల్లో అనంతలోకాలకు చేరారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం రాత్రి, సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు తనువు చాలించారు. ఇందులో ముగ్గురు యువకులు, మరో ఇద్దరు ఇంజినీరింగ్​స్టూడెంట్లు, ఓ మహిళ ఉన్నారు. దీంతో వీరి కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆప్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.  

నాన్న కేక్​ తెస్తాడని....

మిడ్జిల్ :  మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్ మండలం చిల్వేర్  గ్రామానికి చెందిన ఆంజనేయులు(25) ఆదివారం రాత్రి గ్రామంలో స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ ​వేడుకలు జరుపుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటల తరువాత మిడ్జిల్​లోని అత్తగారింట్లో ఉన్న భార్య రేణుక, పిల్లలతో వేడుకలు జరుపుకునేందుకు బయలుదేరాడు. భార్యకు ఫోన్​ చేసి కేక్​ తెస్తున్నానని, పిల్లలు పడుకోకుండా చూడాలని చెప్పాడు. చిలువేరు నుంచి మిడ్జిల్​కు బయలుదేరిన ఆంజనేయులు రాణిపేటలో కేక్ ​తీసుకున్నాడు. అక్కడి నుంచి వెళ్తుండగా మున్ననూరు టోల్ గేట్​దగ్గర 167వ జాతీయ రహదారిపై ఉన్న కేఎల్ఐ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. బైక్ అదుపు తప్పి డివైడర్​ను ఢీకొని చనిపోయాడా? లేక ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా? అనేది తెలియరాలేదు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు కాగా, నాన్న కేక్​తెస్తున్నాడని సంబురంగా ఎదురుచూసిన వారికి అతడి మరణవార్త షాక్​కు గురి చేసింది. ఆంజనేయులు భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి.   

నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే...

నవాబుపేట :  మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేటకు చెందిన సాయికుమార్(21) ఫ్రెండ్స్​తో వేడుకలు జరుపుకున్న తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బైక్​పై వెళ్తున్నాడు. మార్కెట్​యార్డు సమీపంలో బైక్​ అదుపుతప్పి కరెంట్​ పోల్​ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లి అనసూయను ఆపడం ఎవరితరం కాలేదు. మృతుడికి ఈ మధ్యే నిశ్చితార్థం జరిగింది.  

ఇద్దరు ఇంజినీరింగ్​విద్యార్థులు

పటాన్​చెరు :  న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా హాస్టల్ నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్లు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని సుల్తాన్ పూర్ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ చదువుతున్న భరత్ చంద్ర, నితిన్, వర్షిత్ వేడుకలు జరుపుకోవడానికి ఆదివారం రాత్రి సంగారెడ్డి వచ్చారు. సంగారెడ్డి నుంచి అర్ధరాత్రి మరికొంతమంది ఫ్రెండ్స్​తో కలిసి టూ వీలర్లపై హైదరాబాద్​లోని దుర్గం చెరువుకు వెళ్లారు. చెరువుపైకి అనుమతి లేకపోవడంతో తిరుగు ప్రయణమయ్యారు. మార్గమధ్యలో పటాన్ చెరు సాకి చెరువు వద్ద స్నేహితులతో కాసేపు కాలక్షేపం చేసి సంగారెడ్డికి వెళ్తున్నారు. తెల్లవారుజామున పటాన్ చెరు నోవా పాన్ కమాన్ వద్ద స్కూటీ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వరంగల్ జిల్లా పాలకుర్తి చెందిన భరత్ చంద్ర (19), జనగామకు చెందిన నితిన్ (18) అక్కడికక్కడే చనిపోగా, ఖమ్మం పట్టణానికి  చెందిన వర్షిత్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వర్షిత్ ను దవాఖానకు తరలించారు.  

గుడికి వెళ్తుండగా..  

జగిత్యాల రూరల్ :  కొత్త సంవత్సరం ​సందర్భంగా టూ వీలర్​పై గుడికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ చనిపోయింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సామ సుజాత (42) రూరల్ మండలం పొలాస గ్రామంలోని పౌలస్తేశ్వర స్వామి ఆలయానికి సోమవారం స్కూటీపై బయలుదేరింది.  ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో సుజాత తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.  

లారీని ఓవర్​టేక్ ​చేయబోగా...

సూర్యాపేట :  సూర్యాపేట హైటెక్ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి 65  ఫ్లై ఓవర్ పై సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. హైదరాబాద్​లోని హయత్ నగర్ కు చెందిన మేకల నటరాజ్(42), అయ్యప్ప స్వాములు ముక్కోటి శ్రీనివాస్, గోదేశ్​మల్లేశ్​ సీలింగ్ వర్క్స్ చేస్తుంటారు. కొత్త సంవత్సరం మొదటి రోజు మంచి జరుగుతుందని విజయవాడలో సీలింగ్​ వర్క్​ పెట్టుకున్నారు. సోమవారం హైదరాబాద్​నుంచి కారులో విజయవాడ బయలుదేరారు. కారు డ్రైవర్​ ముక్కోటి శ్రీనివాస్ అతి వేగంతో నడుపుతూ విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో ఓవర్​స్పీడ్​లో ఉండడంతో కంట్రోల్​ చేయడానికి బ్రేక్ ​వేయబోయి ఎక్సలేటర్​తొక్కాడు. దీంతో కారు లారీ కిందికి దూసుకువెళ్లింది.  వెనక సీట్లో కూర్చున్న నటరాజ్​అక్కడికక్కడే చనిపోయాడు. బెలూన్స్​ ఓపెన్​ కావడంతో డ్రైవర్​ సీట్లో కూర్చున్న శ్రీనివాస్, పక్క సీట్లో ఉన్న మల్లేశ్​ గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్​స్పెక్టర్​ రాజశేఖర్ తెలిపారు.