కర్నూలు జిల్లాలో విషాదం.. సాంబారు గిన్నెలో పడి విద్యార్ధి మృతి

కర్నూలు జిల్లాలో విషాదం.. సాంబారు గిన్నెలో పడి విద్యార్ధి మృతి

కర్నూలు జిల్లా పాణ్యంలో దారుణం జరిగింది. వేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడి ఓ ఆరేళ్ల బాలుడు మరణించాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయపాలెంకు చెందిన పురుషోత్తమ్ రెడ్డి అనే విద్యార్ధి.. పాణ్యంలోని విజయ నికేతన్ అనే  ప్రైవేటు స్కూల్ లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదవశాత్తు వేడి సాంబారు గిన్నెలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో ఆ బాలుడిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి విద్యార్థి  మృతి చెందాడు.

బాలుడి మరణంతో  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘాలు విజయనికేతన్ స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డాయి. మేనేజ్ మెంట్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి,స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు,జిల్లా సహాయ కార్యదర్శి షేక్. రియాజ్ లు మాట్లాడుతూ.. విద్యార్థి మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి పాఠశాల యాజమాన్యం 50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

గతంలో కూడా ఒక కార్మికుడు విద్యుత్ షాక్ కి గురై మృతి చెందడం జరిగిందని, ఇదే విషయమై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని విద్యార్థి సంఘం నాయకులు అన్నారు.  పాఠశాల మొదలైనప్పటి నుంచి యాజమాన్యం కేవలం డబ్బు ధనార్జనే ధ్యేయంగా పని చేస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తుందని మండిపడ్డారు. ఎటువంటి విద్య ప్రామాణిక సూత్రాలు పాటించకుండా పాఠశాల నడుపుతున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు. లేనిపక్షంలో రేపు ఉదయం పాఠశాల ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులను హెచ్చరించారు.