ఇంగ్లిష్​ మీడియం కోసం తెలుగు మీడియం టీచర్లకే ట్రైనింగ్

ఇంగ్లిష్​ మీడియం కోసం తెలుగు మీడియం టీచర్లకే ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరం  నుంచి సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త టీచర్లను నియమించాల్సిన అవసరం ఉన్నప్పటికీ..  ప్రభుత్వ వర్గాల్లో మాత్రం ఆ ఆలోచనే ఉన్నట్లు కనిపించడం లేదు. ఉన్న తెలుగు మీడియం టీచర్లకే వారంపది రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లిష్​ మీడియంలో క్లాసులు చెప్పించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.  

రాష్ట్రంలో 26,072 ప్రభుత్వ ప్రైమరీ, యూపీఎస్, హైస్కూళ్లున్నాయి. వీటిలో 23లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ప్రస్తుతం అన్ని బడుల్లో ఇంగ్లీష్​ మీడియం క్లాసులు కొనసాగించాలని నిర్ణయించారు. అందుకు గైడ్​లైన్స్ రూపొందించేందుకు 11 మంది మంత్రులతో సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం10,704 సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు కొనసాగుతున్నాయి. దీంతో మరో 15,368 బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాల్సి ఉంది. దీంట్లో వెయ్యిదాకా జీరో ఎన్​రోల్​మెంట్ స్కూళ్లున్నాయి. మిగిలిన 14 వేలకు పైగా బడుల్లో 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం క్లాసులు ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం క్లాసులకు కొత్తగా టీచర్లు అవసరమే కానీ, ప్రైమరీ స్కూళ్లలో ఎందుకనే భావనలో సర్కారు పెద్దలున్నారు. హైస్కూళ్లలోనూ మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు అవసరం. అయినా, కొత్త టీచర్ల నియామకాలకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఉన్న టీచర్లకే పదిరోజుల ట్రైనింగ్
రాష్ట్రంలో 1,03,911 మంది సర్కారు టీచర్లుండగా.. వాళ్లలో 60,604 మంది ఇంగ్లీష్​ మీడియం కొనసాగుతున్న బడుల్లో పాఠాలు చెప్తున్నారు. వీళ్లలో హైస్కూళ్లలో 33,686 మంది ఉండగా, 8,413 మంది యూపీఎస్, 18,505 మంది ప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్నారు. మిగిలిన 43,307 మంది టీచర్లకూ వారం పది రోజులు ట్రైనింగ్ ఇస్తే సరిపోతుందని సర్కారు భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం కొనసాగుతున్న స్కూళ్లలోనూ చాలామంది తెలుగు మీడియంవాళ్లే ఉన్నారు. వాళ్లకూ మరో దఫా శిక్షణ ఇవ్వనున్నారు.

కొత్తోళ్లు రాకుంటే.. ఉన్నోళ్లపైనే భారం
ఇప్పటికే రాష్ట్రంలో సక్సెస్ స్కూళ్లతో పాటు పలు ఇంగ్లీష్ మీడియం కొనసాగుతున్న బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఈ రెండేండ్ల నుంచి విద్యావలంటీర్లనూ తీసుకోలేదు. ఉన్నోళ్లతోనే పాఠాలు చెప్పిస్తున్నారు. దీంతో తెలుగు మీడియంవాళ్లు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్లకు, ఇంగ్లీష్​ మీడియం టీచర్లు తెలుగు మీడియం వారికి క్లాసులు చెప్తున్నారు. కొన్ని బడుల్లో క్లబ్ చేసి ఒకేసారి చెప్తున్నారు. కొత్తగా మరిన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం సెక్షన్లు వస్తున్నా, కొత్తగా టీచర్లను తీసుకునే ఆలోచన సర్కారులో కనిపించడం లేదు. దీంతో ఉన్న టీచర్లపైనే భారం పడనున్నది.