రక్షణ శాఖ భూముల సాధన మా పోరాట ఫలితమే : కేటీఆర్‌‌‌‌‌‌‌‌

రక్షణ శాఖ భూముల సాధన మా పోరాట ఫలితమే : కేటీఆర్‌‌‌‌‌‌‌‌
  • పదేండ్ల ప్రయత్నంతో సాధ్యమైంది
  • కారిడార్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్‌‌‌‌–కరీంనగర్‌‌‌‌ రాజీవ్ రహదారి, హైదరాబాద్-–నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములను ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ముమ్మాటికీ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సాధించిన విజయమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ అనుమతుల కోసం తాము అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేండ్ల పాటు ఎన్నో ప్రయత్నాలు, పోరాటాలు చేశామని ఆయన తెలిపారు. గతేడాది జులై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుందని, దానికి అనుగుణంగా కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగ్గ పరిణామన్నారు. 

గతంలోనే రక్షణశాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాలను కూడా అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్కైవేల నిర్మాణాన్ని ప్రారంభించి, ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రెండు రూట్లలో రక్షణ శాఖ భూములు ఉండటం వల్ల ఇంతకాలం రోడ్ల విస్తరణ సాధ్యంకాకపోవడం, దశాబ్దాల పాటు ప్రభుత్వాలు ఫ్లైఓవర్ల నిర్మాణానికి చొరవ తీసుకోకపోవడంతో.. ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇంతకాలం ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. 

అందుకే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రెండు మార్గాల్లో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం అనేక ప్రణాళికలు రూపొందించామని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు సంప్రదింపులు జరిపామని తెలిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సందర్భంలో అప్పటి సీఎం కేసీఆర్ తోపాటు.. తాను, ఎంపీలు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. 

ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అన్ని రకాల ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, వారు లేవనెత్తిన ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు అందిస్తూ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. తాము చేసిన ఈ ప్రయత్నాల ఫలితమే, నేటి అనుమతులు అని ఆయన పేర్కొన్నారు.