అధికార పార్టీ నేతలు చెప్పినట్టు చేయకుంటే బదిలీ తప్పదు

అధికార పార్టీ నేతలు చెప్పినట్టు చేయకుంటే బదిలీ తప్పదు
  • జిల్లాల్లో అధికార పార్టీ లీడర్ల నుంచి ఆఫీసర్లపై  తీవ్ర ఒత్తిళ్లు
  • అనుకూలంగాఉండని వారికి బెదిరింపులు,ట్రాన్స్ ఫర్లు
  • పలువురు ఎమ్మెల్యేలు మొదలు కార్పొరేటర్ల దాకా ఇదే తీరు

జిల్లాల్లో పలువురు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, లీడర్లు రూల్స్ గీల్స్ జాన్తానై అంటున్నరు. తమ మాట వినని ఆఫీసర్లను రకరకాలుగా వేధిస్తున్నరు. ఫలానా ఆఫీసర్ తమకు అక్కర్లేదంటూ ఏకంగా మీటింగుల్లో నే తీర్మానాలు చేస్తున్నరు. ఈక్రమంలో పలువురికి బెదిరింపులు, ట్రాన్స్ ఫర్లు తప్పడం లేదు. కొన్ని చోట్ల ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా కిందిస్థాయి ఉద్యోగులను ఎగదోయడం, ప్రభుత్వ పెద్దల దగ్గరికి మోయడం పలు జిల్లాల్లో కామన్ గా మారింది. పలువురు ఎమ్మెల్యేలు మొదలుకొని జడ్పీ, మున్సిప ల్ చైర్మన్లు,ఆఖరికి కొందరు కార్పొరేట్లు కూడా కర్ర పెత్తనం చేస్తుండడంతో రూల్స్ ప్రకారం వెళ్లేఆఫీసర్లు అరిగోసపడుతున్నరు.

బిల్లులపై సంతకం పెట్టలేదని..

‘కరోనా కంట్రోల్ కోసం రూ.50 లక్షలు ఖర్చుపెట్టినం.. బిల్లులపై సంతకం పెట్టి ఫండ్స్ రిలీజ్ చేయించండి..’ అంటూ వచ్చిన గద్వాల మున్సిపల్ చైర్మన్ కు అక్కడి కలెక్టర్ శ్రుతి ఓఝూ నో చెప్పారు. ఏ మున్సిపాలిటీలోనూ రూ.10లక్షలకు మించి ఖర్చు చేయలేదని, ఎందుకిలా జరిగిందో క్రాస్ చెక్ చేశాకే సైన్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. దీనిని ఊహించని చైర్మన్ తో పాటు మెజారిటీ కౌన్సిలర్లంతా ఆమెపై అల కబూనారు. ఈ నెల 25న నిర్వహించిన హరితహారం మీటింగ్కు హాజరు కాకుండా నిరసన తెలిపారు.

అక్రమాలకు సహకరించడంలేదని..

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలువురు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాకు, భూకబ్జాలకు అక్కడి కలెక్టర్ అడ్డుతగులుతున్నారని సమాచారం. అభివృద్ధిపనుల బిల్లుల చెల్లింపులోనూ నిక్కచ్చిగా వ్యవహరిస్తుండడంతో చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఇటీవల కలెక్టర్ కు సమాచారమే లేకుండా ఈ నెల 27న జడ్పీ మీటింగ్ పెట్టారు. ఈ విషయంలో సీఈఓను కలెక్టర్ మందలిస్తే తాజాగా జడ్పీ ఉద్యోగులంతా విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. అప్పుడే ఈ పంచాయితీ ప్రభుత్వ పెద్దల దాకా వెళ్లింది. ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని ఓ కీలక మంత్రికి ఫిర్యాదు చేశారని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆఫీసర్ సరెండర్ కు తీర్మానం..

ఈ నెల 24న వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్లో కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్ కు వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులు గళమెత్తారు. ఆయన పనితీరు బాగాలేదని, సరెండర్ చేయాలని మేయర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో తీర్మానం పెట్టారు. సమావేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్, కమిషనర్ పమేలా సత్పతి షాక్ అయ్యారు. ఒక అధికారిని అలా సరెండర్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. మేయర్ మాత్రం తమకు ఇలాంటివి కొత్త కాదనీ, గతంలో 8-9 మంది ఆఫీసర్లను సరెండర్ చేశామని చెప్పారు. చివరికి లీడర్ల పంతమే నెగ్గింది. వారం తిరగకముందే జాకీర్ హుస్సేన్ టౌన్ ప్లానింగ్ సూపరిండెంట్ గా బదిలీ అయ్యారు.

ఎన్నెన్ని లీలలో..

కరీంనగర్ జిల్లాలో తమకు సహకరించడం లేదనే నెపంతో చొప్పదండి మున్సిపల్ ఇన్ చార్జి కమిషనర్ రాజేంద్ర కుమార్, తిమ్మాపూర్ తహసీల్దార్ రాజేశ్వరి, గన్నేరువరం తహసీల్దార్ ప్రభాకర్ ను అక్కడి ప్రజా ప్రతినిధులు బదిలీ చేయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తరుచూ జరుగుతున్న పోలీస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ల వెనుక అధికార పార్టీ లీడర్ల ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. గతేడాది కేవలం రెండు వారాల వ్యవధిలో ఏకంగా ఏడుగురు పోలీస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ..మంచిర్యాల జిల్లా ఇందారం ఓసీపీ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అధికార పార్టీ లీడర్ల ఒత్తిళ్లు తట్టుకోలేకే మంచిర్యాల ఆర్డీవో నెల కింద లీవ్ పెట్టి వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. మంచిర్యాల టౌన్లో కొందరు రియల్ట ర్ల కోసం టీఆర్ ఎస్ కు చెందిన కీలక ప్రజాప్రతినిధి అనుచరులు రాముని చెరువు మత్తడికి గండి పెట్టించారనీ, అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా తమపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆఫీసర్లు అంటున్నారు.

… ములుగు జిల్లాలో సమ్మక్క జాతర సందర్భంగా పనుల్లో క్వాలి టీ ని ప్రశ్నిం చిన అప్పటి కలెక్ట ర్ నారాయణ రెడ్ డిని నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేయించడంలో టీఆర్ఎస్ ప్రజాప్రతిని ధులు కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ తహసీల్దార్ ను తనకు సహకరించడం లేదనే కారణంతో కొద్ది నెలల కింద పట్టుబట్టి బదిలీ చేయించారనే విమర్శలున్నాయి.

..కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్ డినియోజక వర్గాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా నాలుగు నెలల క్రితం ఇక్కడకు వచ్చిన ఒకరు డ్యూటీలో చేరిన వారంలోనే లీవ్ పెట్టి వెళ్లడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది.

..నల్గొండ జిల్లాలో తాను చెప్పినట్లు వినడంలేదనే కారణంతో ఆర్ బ్ల్యూఎస్ ఈఈని పట్టుబట్టి ట్రాన్స్ ఫర్ చేయించారు. భువనగిరి రూరల్ ఎస్ ఐ రాజశేఖర్, ఆలేరు ఏవో శ్రీప్రియ ట్రాన్స్ ఫర్ల వెనుక రాజకీయ కారణాలు ఉన్నారనే ఆరోపణ లున్నాయి.

..భద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆఫీసర్లపై టీఆర్ఎస్ లీడర్లు ఒత్తిడి తెస్తున్నారు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ షఫీ ఉల్లా తన మాట వినడం లేదని అక్కడి ఓ ప్రజాప్రతినిధి ట్రాన్స్ ఫర్ చేయించారు. మరోవైపు ప్రజాప్రతినిధుల ఒత్తిడి తట్టుకోలేక కొత్తగూడెం కమిషనర్ బదిలీ పై వెళ్లారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా ఆఫీసర్ల పోస్టింగులు, ట్రాన్స్ ఫర్లలో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు తీవ్రంగా జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు న్నాయి.

..వనపర్తి జిల్లా దేవరకద్రలోని మదనాపురం ఎస్ఐ ని ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేయించడంలో, డీఆర్ డీఏ పీడీ గణేశ్ ను రాత్రికి రాత్రే సరెండర్ చేయించడంలో ఇక్కడి కీలక ప్రజాప్రతినిధి హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. గద్వాల జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డు తగిలారనే కారణంతో డీఎస్పీని రాత్రికి రాత్రే బదిలీ చేశారు.

ఎమ్మెల్యేలు ఎంత చెబితే అంత..

జెడ్పీ, కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్లు, సభ్యులు, కార్పొరేటర్ లెవల్ లీడర్లే కలెక్టర్లు, ఇతర ఐఏఎస్ స్థాయి ఆఫీసర్ల మీద ఇంతలా జులుం చెలాయిస్తుంటే, కింది స్థాయి ఆఫీసర్లపరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఇక పలువురు ఎమ్మెల్యేలైతే నియోజకవర్గాలను సామంత రాజ్యాలుగా చేసుకొని ఆఫీసర్లను, పోలీసులను ఓ ఆట ఆడుకుంటున్నారనే విమర్శలున్నాయి. తమ , తమ అనుచరుల భూకబ్జాలు, అక్రమ ఇసుక రవాణా, ఇతర దందాలకు ఎక్కడైనా, ఎవరైనా అడ్డుతగిలితే నయానో, భయానో దారికి తెచ్చుకుంటున్నా రు. వినకపోతే ట్రాన్స్ఫర్ చేయించి పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.