హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బదిలీల్లో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీ) ట్రాన్స్ ఫర్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీగా ఉన్న యాదగిరి బుధవారం రిటైర్ అయ్యారు. దీంతో కరీంనగర్ ఈడీగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును గ్రేటర్ ఈడీగా బదిలీ చేశారు. బస్ భవన్లో మెడికల్, అడ్మిన్ ఈడీ గా పనిచేస్తున్న వినోద్ కుమార్‌ను కరీంనగర్ ఈడీగా బదిలీ చేశారు.
చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) గా పనిచేస్తున్న ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ ఓఎస్డీ కృష్ణకాంత్‌కు ఈడీగా పదోన్నతి ఇచ్చి, అడ్మిన్, మెడికల్ ఈడీగా పోస్టింగ్ ఇచ్చారు. 36 ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీ, టీఎస్ ఆర్టీసీలో పనిచేసి ఈడీగా రిటైర్ అయిన యాదగిరి దంపతులను చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ బుధవారం రాణిగంజ్ డిపోలో ఘనంగా సన్మానించారు. ఆర్టీసీలో ఎంతో సమర్థుడిగా పనిచేశారని ఆయన సేవలను కొనియాడారు. ఆర్టీసీలో పనిచేయటం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని యాదగిరి తెలిపారు.
