హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం ఏరియాలో భూముల ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రాయదుర్గం భూములకు అంతకంతకూ డిమాండ్ భారీగా పెరిగిపోతున్నది. ఒకసారి రికార్డ్ ధర అనుకునేలోపే.. రెండు మూడు నెలల్లోనే ఆ రికార్డు బ్రేక్ అయిపోతున్నది. శుక్రవారం (ఆగస్ట్ 28) రాయదుర్గంలోని పాన్ మక్తాలో 5.8 ఎకరాల భూమికి టీజీఐసీసీ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. ఎకర రూ.269 కోట్ల చొప్పున మొత్తం 5.8 ఎకరాల భూమిని వంశీరామ్ బిల్డర్స్ రూ.1,447 కోట్ల రికార్డ్ ధరకు దక్కించుకుంది. ఇది రిజర్వ్ ధర కంటే 52.3 శాతం అధికం.
గత వారం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములకు నిర్వహించిన వేలంలో ఎకరం ధర రూ.264 కోట్లు పలికిన విషయం తెలిసిందే. సర్వే నెంబర్ 83/1లోని ప్లాట్ నంబర్ పీ1లో ఉన్న 5.25 ఎకరాల భూమికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) వేలం నిర్వహించింది. కనీస ధరగా ఎకరానికి రూ.175 కోట్లుగా నిర్ణయించింది. పోటాపోటీగా సాగిన వేలంలో ఎంఎస్ ఎన్ రియాల్టీ అనే సంస్థ భూమిని దక్కించుకుంది.
ఎకరానికి రూ.264 కోట్లు పాడింది. మొత్తంగా 5.25 ఎకరాల భూమిని ఆ సంస్థే దక్కించుకోగా.. టీజీఐఐసీకి రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది రిజర్వ్ ధర కన్నా 51 శాతం అధికం కావడం విశేషం. ఇదిలా ఉండగానే.. వారం రోజుల్లోనే ఈ రికార్డ్ కూడా బ్రేక్ అయ్యింది.
శుక్రవారం (ఆగస్ట్ 28) రాయదుర్గంలోని పాన్ మక్తాలో 5.8 ఎకరాల భూమికి టీజీఐసీసీ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. పోటాపోటీగా సాగిన వేలంలో ఎకర రూ.269 కోట్ల చొప్పున మొత్తం 5.8 ఎకరాల భూమిని వంశీరామ్ బిల్డర్స్ రూ.1,447 కోట్ల రికార్డ్ ధరకు దక్కించుకుంది. ఇది రిజర్వ్ ధర కంటే 52.3 శాతం అధికం.
రాయదుర్గంలోని 10.63 ఎకరాల భూమికి రెండుసార్లు జరిగిన వేలం ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.2,833.22 కోట్ల ఆదాయం సమకూరింది. P1 ద్వారా రూ.1,386 కోట్ల ఆదాయం రాగా, P2 వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.1,447.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఎకరాకు సగటున రూ.266.53 కోట్లు పలికింది.
భూమి రికార్డ్ ధర పలకడం రాయదుర్గం కారిడార్‌పై పెట్టుబడిదారుల భారీ ఆసక్తికి నిదర్శనమని అధికారులు అంటున్నారు. హైదరాబాద్ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి డెవలపర్ల విశ్వాసం ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోందని అంటున్నారు. రాయదుర్గంలో భూముల విలువ వేగంగా పెరుగుతున్నదనడానికి ఈ వేలం మరో ఉదాహరణగా నిలిచిందన్నారు.
