మాకు హైదరాబాదే కావాలి

మాకు హైదరాబాదే కావాలి
  •     పోస్టింగ్ కోసం డాక్టర్ల సంఘాల నాయకుల లొల్లి
  •     కోఠిలోని డీఎంఈ ఆఫీస్ ఎదుట రెండు వర్గాల మధ్య వాగ్వాదం
  •     డాక్టర్‌‌‌‌ శేఖర్‌‌‌‌పై మరో వర్గం నేతల దాడి

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల నడుమ ట్రాన్స్‌‌ఫర్ల లొల్లి జరుగుతున్నది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఎదుట శుక్రవారం సాయంత్రం జరిగిన లొల్లి, భౌతిక దాడుల వరకూ వెళ్లింది. ట్రాన్స్‌‌ఫర్ల గురించి వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో నాగర్‌‌‌‌కర్నూల్‌‌ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ శేఖర్‌‌‌‌పై, మరోవర్గం ప్రొఫెసర్లు దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. తనపై అకారణంగా దాడి చేశారని శేఖర్ ఆరోపించారు.

తనపై దాడి చేసి గాయపర్చిన డాక్టర్లు బొంగు రమేశ్‌‌, పల్లం ప్రవీణ్‌‌, వినోద్‌‌కుమార్, లాలూ ప్రసాద్‌‌లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ డీఎంఈ ఆఫీసులో ఆయన బైఠాయించారు. తర్వాత సుల్తాన్‌‌ బజార్ పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. ఈ దాడిపై బొంగు రమేశ్‌‌ స్పందిస్తూ.. తాము ఎవరిపై దాడి చేయలేదన్నారు. తమపై పెట్రోల్‌‌ పోసి తగులబెడ్తానని శేఖర్‌‌‌‌ బెదిరించడంతో ఘర్షణ జరిగిందన్నారు. తాము కూడా శేఖర్‌‌‌‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.

అసలెందుకు లొల్లి?

రెండేండ్లకుపైగా ఒకేచోట పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ట్రాన్స్‌‌ఫర్ చేయాలని ఇటీవలే సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 40 శాతం మందిని ట్రాన్స్‌‌ఫర్ చేయాలని సర్కార్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ట్రాన్స్‌‌ఫర్లకు డీఎంఈ వాణి ఏర్పాట్లు చేయిస్తున్నారు. అయితే, ఈ ట్రాన్స్‌‌ఫర్ల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీజీడీఏ) ప్రతినిధులు డాక్టర్లు బొంగు రమేశ్‌‌, పల్లం ప్రవీణ్‌‌, వినోద్‌‌కుమార్‌‌‌‌ డీఎంఈకి విజ్ఞప్తి చేశారు. 20 శాతం మందిని మాత్రమే ట్రాన్స్‌‌ఫర్ చేయాలని కూడా వీరంతా కోరారు.

అయితే ఇలా మినహాయింపులు ఇవ్వడం, 20 శాతం మందిని మాత్రమే బదిలీ చేయడం వల్ల చాలా ఏండ్లుగా జిల్లాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు, హైదరాబాద్‌‌కు వచ్చే అవకాశం ఉండదని జిల్లాల్లో పనిచేస్తున్న డాక్టర్లు చెబుతున్నారు. డాక్టర్‌‌‌‌ శేఖర్‌‌‌‌ కూడా ఇదే విషయంపై శుక్రవారం డీఎంఈని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు. ప్రభుత్వ జీవో ప్రకారం 40 శాతం మందిని బదిలీ చేయాలని ఆయన డీఎంఈని కోరారు. టీజీడీఏకు కొన్నేండ్లుగా ఎన్నికలే జరగలేదని, ఆఫీస్ బేరర్లం అని చెప్పుకుని బొంగు రమేశ్‌‌, పల్లం ప్రవీణ్ తదితరులు సుదీర్ఘకాలంగా హైదరాబాద్‌‌లోనే పోస్టింగ్‌‌లు తీసుకుంటున్నారని శేఖర్ వర్గం ఆరోపిస్తున్నది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య శుక్రవారం ఘర్షణ నెలకొంది.