
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రాన్స్ జెండర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బంధం చెరువు సమీపంలో ట్రాన్స్ జెండర్ మృతదేహం లభ్యమైంది. చెట్ల పొదల్లో మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ జెండర్ ను హత్య చేసి.. చెట్ల పొదల్లో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి వయస్సు సుమారు 30 నుంచి 32 మధ్య ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.