హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బస్సులను రవాణా శాఖ అధికారులు గురువారం తనిఖీ చేశారు. ఫిట్ నెస్ లేని, పన్నులు చెల్లించని 38 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. ఫిట్నెస్ లేని,15 ఏండ్లు దాటిన బస్సులను ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిప్పొద్దన్నారు. అనుభవం ఉన్న డ్రైవర్లనే తీసుకోవాలని, 60 ఏండ్లు దాటని వాళ్లనే డ్రైవర్లుగా పెట్టుకోవాలని సూచించారు. తనిఖీలు కొనసాగుతాయని, ప్రతి విద్యా సంస్థ తమ బస్సులకు సంబంధించి రవాణా శాఖ ఆఫీస్నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు.