ఫిట్‌‌నెస్ లేకుండా రోడ్డెక్కితే స్కూల్‌‌ బస్సులు సీజ్..రవాణా శాఖ అధికారుల హెచ్చరిక

ఫిట్‌‌నెస్ లేకుండా రోడ్డెక్కితే స్కూల్‌‌ బస్సులు సీజ్..రవాణా శాఖ అధికారుల హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానుండటంతో రవాణా శాఖ అధికారులు పాఠశాల, కాలేజీల వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థుల భద్రతే ధ్యేయంగా రవాణా వాహనాలన్నీ పూర్తి ఫిట్‌‌నెస్‌‌తో ఉండాలని, లేనిపక్షంలో వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం రవాణా శాఖ అధికారులు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాసంస్థల బస్సుల తనిఖీ కోసం ఇప్పటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

విద్యార్థులను తీసుకెళ్లే ప్రతి బస్సు, వాహనానికి విధిగా రవాణా శాఖ నుంచి ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్ ఉండాలని చెప్పారు. ఫిట్‌‌నెస్ లేని వాహనాలతో పాటు, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకునే (ఓవర్ లోడ్) బస్సులు, భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలను తక్షణమే సీజ్ చేస్తామని హెచ్చరించారు. వాహనాల బ్రేకులు, టైర్లు, ఇండికేటర్లు, లైట్లను యాజమాన్యాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు తేల్చిచెప్పారు.