
వరద బాధితులకు అండగా ఉంటం
ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షలో మంత్రి ఈటల
హైదరాబాద్, వెలుగు: వరద ప్రభావిత ప్రాంతాల్లో విష జ్వరాలు, డయేరియా వంటి రోగాలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. కలుషిత నీరు, ఆహారం వల్ల వచ్చే వ్యాధు ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావుతో కలిసి వరదల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై మంత్రి శనివారం సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 165 హెల్త్ క్యాంపులు, 46 మొబైల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినట్టు డైరెక్టర్ వివరించారు. ఫ్లడ్ రిలీఫ్ క్యాంపుల్లో జ్వరం, జలుబు లక్షణాలుంటే వెంటనే కరోనా టెస్ట్ చేస్తున్నామన్నారు. ఇలా 2 వేల మందికి టెస్ట్ చేస్తే 19 మందికి పాజిటివ్ వచ్చిందని, వారందరినీ ప్రభుత్వ హాస్పిటళ్లకు తరలించామని తెలిపారు. మొత్తం16 వేల మంది వరద బాధితులకు వైద్య సహాయం అందజేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరదలతో కష్టకాలంలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అవసరమైతే బాధితుల ఇండ్లకే వెళ్లి చికిత్స చేసి, మందులు ఇవ్వాలన్నారు. క్యాంపుల్లో మాస్కులు, శానిటైజర్లు ఇవ్వాలని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ జ్వరాలు ఇతర ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి చెప్పారు. జ్వరం రాగానే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, హాస్పిటల్స్‌కు వెళ్లి టెస్టులు చేయించుకోవాలని సూచించారు. నీరు కాచి, చల్లార్చుకుని తాగాలని, ఆహారం వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలన్నారు.
For More News..