చెట్లు పెంచితేనే ఇంటి పర్మిషన్

చెట్లు పెంచితేనే  ఇంటి పర్మిషన్

హైదరాబాద్, వెలుగు: ఇంటి నిర్మాణానికి అనుమతివ్వాలంటే ఇంకుడు గుంతలు, ఆవరణలో చెట్లు, పచ్చదనం పెంపొందించేందుకు ఖాళీ స్థలం తప్పనిసరి. ఇల్లు కడుతున్నప్పుడు ఆ స్థలంలో ఉన్న చెట్లను నరికేయాల్సి వస్తే తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి . ప్రత్యామ్నాయంగా మొక్కల్ని నాటాలి. ఇంటి నిర్మాణానికి చెట్టు పూర్తిస్థాయిలో అడ్డుగా ఉంటేనే తొలగించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.

ఇల్లు, అపార్ట్ మెంట్లు నిర్మించేటప్పుడు ఖాళీ స్థలంలో 20 శాతం మొక్కలు నాటాలని ప్రస్తుతం నిబంధనలున్నాయి. పచ్చదనం కోసం 20 నుంచి 30 శాతం ఖాళీ స్థలం ఉంచాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే 50శాతం స్థలాన్ని పచ్చదనానికి కేటాయించేలా నిబంధనలు రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపి ఆమోదం తీసుకోవాలని  గ్రేటర్​ హైదరాబాద్​ అధికారులు యోచిస్తున్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనానికి ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో జీహెచ్​ఎంసీ ప్రతిపాదనను కూడా ఆమోదిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఫస్ట్ ప్లేస్లో ఖైరతాబాద్
హైదరాబాద్ మహానగరం ఆరు జోన్లుగా విభజించి ఉంది. ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్, చార్మినార్  జోన్లుగా పరిగణిస్తున్నారు. ఆరు జోన్లలో చార్మినార్ జోన్ అత్యల్ప పచ్చదనం కలిగి ఉంది. జీహెచ్ఎంసీ అధ్యయనం ప్రకారం మొదటి స్థానంలో  ఖైరతాబాద్ జోన్ నిలిచింది. 99 చదరపు కిలోమీటర్లుగా ఉన్న చార్మినార్ జోన్ లో 1.73లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 111  ల్యాండ్ స్కేప్ పార్కులున్నాయి. వీటిలో 78 రాజేంద్రనగర్ సర్కిల్ లోనే ఉన్నాయి. 76 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న  ఖైరతాబాద్ జోన్ లో 11.44  లక్షల మీటర్ల విస్తీర్ణంలో 229  ల్యాండ్ స్కేప్ పార్కులున్నాయి. ఇంటి నిర్మాణం పచ్చదనం పెంపొందించడాన్ని అనుసంధానం చేయడం ద్వారా  పచ్చదనం పెంపొందించేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.