Moral Story: చెట్టునీడ..ఓపెన్ ఎయిర్ గార్డెన్ రెస్టారెంట్..అపార్ట్ మెంట్ సంస్కృతి.. ప్రకృతికి శాపమా

Moral Story: చెట్టునీడ..ఓపెన్ ఎయిర్ గార్డెన్ రెస్టారెంట్..అపార్ట్ మెంట్ సంస్కృతి.. ప్రకృతికి శాపమా

శాన్విక ఐదో తరగతి చదువుతోంది. తెలివిగల పిల్ల. తనకి చెట్లన్నా, పక్షులన్నా ఎంతో ఇష్టం. తాను ఉండే అపార్ట్‌‌మెంట్‌‌లో చెట్లు, పక్షులు లేకపోవడంతో పక్కనే ఉన్న మహావీర్ కొట్టు దగ్గరికి తరచుగా వెళ్తుంటుంది. ఆ బడ్డీ కొట్టు పక్కనే రోడ్డుకు ఆనుకుని ఓ పెద్ద దిరిసెన చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ అరుగు ఉంది. ఆ కొట్టు దినదినాభివృద్ధి చెందుతుండటంతో దాన్ని పెద్ద హోటల్​గా మార్చాలని చూస్తున్నాడు మహావీర్.

ఒకరోజు శాన్విక అక్కడికి వచ్చింది. కొట్టు లోపలున్న డబ్బాలోంచి కొన్ని పప్పుల్ని గుప్పిట్లోకి తీసుకుంది. ఆమెకిది అలవాటే. మహావీర్ ఏమీ అనడు. పిడికిలిలో ఉన్న పప్పుల్ని దిరిసెన చెట్టు మొదట్లో రెండు మూడు చోట్ల వేరువేరుగా పెట్టింది. చెట్టుపైనున్న పక్షుల్ని చూస్తూ, ‘ఓయ్.. రండి!’ అని పిలిచింది. ఆమె గొంతు విన్న పిచ్చుకలు, పావురాలు కిందకొచ్చి వాలాయి.  

శాన్విక రెండు జామకాయలను తీసుకొచ్చి గోడమీద పెట్టింది. ఒక రామచిలుక అక్కడే నుంచొని జామకాయను తింటూ ఉంటే, మరో రామచిలుక మరో జామకాయను తీసుకుని చెట్టు పైకి వెళ్లింది. సన్నగా గాలి మొదలవడంతో ఆకులమీద వాలిన సీతాకోకచిలుకలు రెక్కలు విప్పుకుంటూ పైకి లేచాయి. పరిసరాల్ని రంగులమయం చేశాయి. కళ్లప్పగిస్తూ సంబరంగా చూడసాగింది శాన్విక. అంతలో ఆమె స్నేహితులు అక్కడికొచ్చారు. అందరూ కలిసి నవ్వుతూ, పాడుతూ ఆడుకున్నారు.

కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు శాన్విక చెట్టు దగ్గరికి వెళ్లి చూసేసరికి కొంతమంది పెద్దవాళ్లు ఆ చెట్టును కొలుస్తున్నారు. దిరిసెన చెట్టును కొట్టేసి అక్కడ హోటల్ కట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు అర్థమైంది. ఆమెకు ఏడుపు వచ్చేసింది. ఇకనుంచి అక్కడ చెట్టు ఉండదనే నిజాన్ని ఆమె మనసు తట్టుకోలేకపోయింది. 

రాత్రి పడుకుంటే రోజూ అక్కడ పక్షులతో సరదాగా గడిపిన క్షణాలు గుర్తుకొచ్చాయి. చెట్టును రంపంతో కోస్తుంటే పైనున్న ఉడతలు భోరున ఏడుస్తున్నట్లు, సీతాకోకచిలుకలు చెల్లాచెదురైపోయినట్లు, రామచిలుకలు, పావురాలు చెట్టును కొట్టొద్దని ప్రాధేయపడుతున్నట్లు కలలొస్తున్నాయి.
తర్వాతిరోజు చెట్టును కొట్టడానికి పనివాళ్లు వచ్చారు. శాన్విక పరిగెత్తుకుంటూ వెళ్లి, చెట్టును రెండు చేతులతో గట్టిగా హత్తుకుని, “ఈ చెట్టును కొట్టొద్దు... ప్లీజ్...” అంటూ అడ్డుపడింది. పనివాళ్లు భయంతో ఆగిపోయారు. ఊహించని సంఘటనకు మహావీర్ బెదిరిపోయాడు. 

మహావీర్ భార్య వెంటనే వెళ్లి శాన్వికను ఓదార్చుతూ పక్కకు తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. శాన్విక ఇంకా గట్టిగా చెట్టును పట్టుకుంది. వదల్లేదు. “నేనిక్కడికి వచ్చేదే ఈ చెట్టునీడలో ఆడుకోవడానికి! ఇక్కడుంటే ఊర్లో ఉన్నట్లే ఉంటుంది. చెట్టు తీసేస్తే ఈ పక్షులన్నీ ఎక్కడుంటాయ్? మంచి గాలి ఎక్కడ్నుంచి వస్తుంది? సుందర్ లాల్ బహుగుణ గురించి స్కూల్లో చెప్పారు. ఆయనవల్ల ఎన్నో చెట్లు బతికాయంట.. అలాంటివాళ్లు చెట్ల గొప్పతనం చాటుతుంటే మీరెందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్, ఈ చెట్టు నరక్కండి అంకుల్...” దీనంగా అడిగింది.

చుట్టుపక్కలున్న గేటెడ్ కమ్యూనిటీల్లో పార్కులంటే ఎదుగూబొదుగూ లేని చిన్నమొక్కలే.. అపార్ట్​మెంట్ సంస్కృతి పసి హృదయాలను ప్రకృతికి ఎలా దూరం చేస్తుందో మహావీర్​కి అర్థమైంది. ఆలోచనలో పడ్డాడు. పాప కోసమే కాకుండా ప్రకృతి కోసం నిర్ణయం తీసుకున్నాడు.

“సారీ శాన్వి! ఈ చెట్టును అలాగే ఉంచుతాను” అని మాటిచ్చాడు.
చెప్పినట్లుగానే దిరిసెన చెట్టును కూల్చలేదు. దాన్ని, దాని అరుగును అలాగే ఉంచి, చుట్టూ పచ్చని మొక్కలు నాటి, ఆరు బయటే కూర్చుని తినేలా ఒక అందమైన హోటల్ (ఓపెన్ ఎయిర్ గార్డెన్ రెస్టారెంట్) నిర్మించాడు. మూడు నెలల తర్వాత హోటల్ ప్రారంభోత్సవం జరిగింది. శాన్విక ప్రత్యేక అతిథిగా వచ్చింది. మహావీర్ ఆమెను పక్కకు తీసుకెళ్లి “అదిగో... అటు చూడు” అన్నాడు. 

 “ఈ మొక్కకు నీ పేరే పెట్టాను. నువ్వెంత ఎత్తు ఉన్నావో ఈ మొక్క కూడా అంతే ఎత్తు ఉంది. నీతోపాటే ఇదీ పెరుగుతుంది. దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే! ఇది పెరిగే కొద్దీ ఇంకొన్ని పక్షులొచ్చి చేరతాయి.” అన్నాడు మహావీర్. సంతోషంతో మొక్కను తీసుకుని గుంతలో నాటింది. ‌‌‌‌

 - దొండపాటి కృష్ణ -