- ఆదిలాబాద్ లోక్‌సభ ఎంపీ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు
- బీజేపీ, కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ
- సోషల్ మీడియా ద్వారా జోరుగా ప్రచారం
- సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి
నిర్మల్, వెలుగు: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం ఆయా పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్ నుంచి నిర్మల్ జిల్లాలోని పలువురు గిరిజన నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్ల బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ముఖ్యంగా నిర్మల్ సెగ్మెంట్ లో 50 వేలకు పైగా ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలుపొందగా ముథోల్ సెగ్మెంట్ నుంచి రామారావు పటేల్ 23 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
దీంతో జిల్లాలోని బీజేపీ గిరిజన నాయకులు ఎంపీ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలెట్టారు. భైంసా మా ర్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ బాబు, ఖానాపూర్‌కు చెందిన మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, సినీ నటుడు అభినవ సర్దార్ కేతావత్ ఈ సారి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుత ఎంపీ సోయం బాపూరావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
భైంసాకు చెందిన రాజేశ్ బాబుకు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మద్దతిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఖానాపూర్ సెగ్మెంట్ నుంచి మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ తిరిగి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని అనుకూలంగా మలుచుకొని బీజేపీ నుంచి ఎలాగైనా టికెట్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వీరితోపాటు కేంద్ర మంత్రి అమిత్ షా అండతో ఎంపీ టికెట్ సాధించుకునేందుకు అచ్చంపేటకు చెందిన సినీ నటుడు అభినవ సర్దార్ కేతావత్ కొద్ది రోజుల నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.
కాంగ్రెస్ నుంచి వీరే ఆశావహులు
కాంగ్రెస్ పార్టీ నుంచి భైంసాకు చెందిన ఐఆర్ఎస్ అధికారి ప్రకాశ్ రాథోడ్, రాంకిషన్ నాయక్‌తో పాటు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఆమె భర్త శ్యాంనాయక్ ఈ సారి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఐఆర్ఎస్ అధికారి ప్రకాశ్ రాథోడ్, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ ఇంటికి వెళ్లి చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ , ఆమె భర్త శ్యామ్ నాయక్ ఈసారి ఎలాగైనా తమకు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో తమకున్న అనుబంధంతో ఎంపీ టికెట్ తమలో ఎవరికో ఒకరికి వస్తుందని వారిద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మొన్నటి ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన భూక్యా జాన్సన్ నాయక్ తిరిగి ఆ పార్టీ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం...
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న గిరిజన నాయకులు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. భైంసాకు చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ బాబు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం బలపరచాలని పిలుపునిస్తూ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ నాయకుడినంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్, లాంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలపై రోజూ పెద్ద ఎత్తున బీజేపీ అనుకూల ప్రచారం సాగిస్తున్నారు. సినీ రంగానికి చెందిన అభినవ సర్దార్ కేతావత్ సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన కథనాలను ప్రచారం చేస్తూ బీజేపీకి అండగా నిలవాలని, మోదీని మరోసారి ప్రధానిగా చేయాలని పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఐఆర్ఎస్ అధికారి ప్రకాశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఆమె భర్త శ్యాం నాయక్‌లు సోషల్ మీడియానే ప్రచారాస్త్రంగా మలుచుకుంటూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.