ఆసిఫాబాద్​ జిల్లాలో ట్రైబల్​ స్టూడెంట్లకు  బోర్ నీళ్లే దిక్కు

ఆసిఫాబాద్​ జిల్లాలో ట్రైబల్​ స్టూడెంట్లకు  బోర్ నీళ్లే దిక్కు
  •     హస్టళ్లలో ఏండ్ల నుంచి పనిచేయని ఆర్వో ప్లాంట్లు
  •     కలుషిత నీరు తాగుతూ రోగాల బారిన విద్యార్థులు
  •     పట్టించుకోని ఐటీడీఏ అధికారులు

ఆసిఫాబాద్, వెలుగు : స్టూడెంట్లకు శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో సర్కారు ప్రతి గిరిజన వసతి గృహంలో ఆర్వో ప్లాంట్​లను ఏర్పాటు చేసినా నిర్వహణ లేక మూలపడ్డాయి. దీంతో గిరిజన విద్యార్థులకు బోర్​నీళ్లే దిక్కవుతున్నాయి. ఆసిఫాబాద్​ జిల్లాలోని గిరిజన బాలబాలికల కోసం 46 వసతి గృహాలున్నాయి. ఇందులో 11,171 మంది  చదువుకుంటున్నారు. హాస్టళ్లలోని విద్యార్థుల తాగునీటి కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో సుమారు రూ.10 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి హస్టల్​లో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు. కానీ జిల్లాలో ఏ ఒక్క హస్టల్​లో కూడా ఇవి పనిచేయడం లేదు. వాటిని ఏర్పాటు చేశారే తప్పా వాటి నిర్వహణను మాత్రం ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో పాడైపోయి మూలనపడ్డాయి. దీంతో గత్యంతరం లేక విద్యార్థులకు బోరు నీళ్లే తాగుతున్నారు. కలుషితమైన బోరు నీటి వల్ల చర్మ వ్యాధులు, ఇతర ఆనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఫలితంగా వారి చదువులకు ఆటంకం ఏర్పడుతోంది.

అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం

కెరమెరి మండలం రాంజీగుడా గిరిజన ఆశ్రమ వసతి గృహంలోని స్టూడెంట్లకు శుద్ధమైన నీరు అందించేందుకు ఐటీడీఏ అధికారులు పడేండ్ల క్రితం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ అది పాడైపోయి ఏండ్లు గడుస్తున్నా రిపేర్ మాత్రం చేయించడంలేదు. కలుషితమైనవి అని తెలిసినప్పటికీ గత్యంతరం లేక అందులో చదివే 110 మంది విద్యార్థులు బోర్ నీళ్లే తాగుతున్నారు. జోడేఘాట్ హాస్టల్​లో చదివే 250  మంది స్టూడెంట్లదీ ఇదే పరిస్థితి. ఆర్వో ప్లాంట్లను బాగుచేయాలని ప్రతి ఏటా ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాటికి మరమ్మతులు చేయించి విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించాలని కోరుతున్నారు.

నెలలపాటు మాత్రమే పనిచేసి..

జైనూర్ మండలంలో ఏడు ఆశ్రమ హాస్టళ్లలో దాదాపు 1700 మంది చదువుకుంటున్నారు. ఆ హాస్టళ్లలో మినరల్ వాటర్ కోసం ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు కొన్ని నెలలు మాత్రమే పనిచేసి పాడైపోయాయి. రాసిమెట్టి, జైనూర్, గౌరీ, పట్నాపూర్​లోని గర్ల్స్ హాస్టళ్లతోపాటు.. మార్లవాయి, పానపటార్, పోచంలొద్ది బాయ్స్ హాస్టళ్లలోని ప్లాంట్లు నిరూపయోగంగా ఉన్నాయి. దీంతో స్టూడెంట్లు మంచినీటి కోసం గోసపడుతున్నారు. కొన్ని హాస్టళ్లలోని విద్యార్థులు ఓపెన్ బావి నీళ్లు తాగుతుండగా.. మరికొన్ని హాస్టళ్లకు చెందిన స్టూడెంట్లు బోర్ నీళ్లు తాగుతున్నారు. తిర్యాణి మండలంలోని గిన్నేధరి, రొంపల్లి, మంగి, పంగిడి మదరా, చెలిమెలతోపాటు కౌటల మండలం మొగడ్ ధగడ్ లోని హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు మూలనపడి ఏండ్లు గడుస్తున్నాయి. దీంతో అక్కడ చదివే వందలాది మంది స్టూడెంట్లకు బోర్​వెల్ నీళ్లే దిక్కయ్యాయి. 

ప్రైవేట్ ప్లాంట్ నుంచి మినరల్ వాటర్ సప్లై

మా హాస్టల్ లో 300 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. గవర్నమెంట్ ఫండ్​తో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్​  ఏండ్ల సంది పనిచేయడంలేదు. దీంతో ప్రతిరోజూ 20 డబ్బాల మినరల్ వాటర్ బయట నుంచి తెప్పిస్తున్న. డబ్బాకు రూ.20 చొప్పున రోజుకు రూ.400 తోపాటు మరో రూ.200 ఎక్స్​ట్రా ఖర్చవుతోంది. ఈ వాటర్ కు సంబంధించిన బిల్లు ఏడాది నుంచి అందలేదు.

-  పెందోర్ జైవంత్, మార్లవాయి ఆశ్రమ స్కూల్ డిప్యూటీ వార్డెన్