ఎల్ఆర్ఎస్ పై అడవి బిడ్డల పోరు

ఎల్ఆర్ఎస్ పై అడవి బిడ్డల పోరు
  • ఆపేయాలంటూ కుమ్రంభీం జిల్లా జైనూర్​లో ఆదివాసీల మహాధర్నా
  • వెంటనే ప్రకటించాలని  2 గంటలు రోడ్డుపై బైఠాయింపు
  • ఏజెన్సీని ఎత్తేయాలన్న బాల్క సుమన్​ మాటలపై మండిపాటు

ఆసిఫాబాద్/జైనూర్, వెలుగుసర్కారు చేపడుతున్న ఎల్​ఆర్​ఎస్​, ఆస్తుల సర్వేపై అడవిబిడ్డలు తిరగబడ్డారు. ఏజెన్సీ భూముల జోలికి రాబోమని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్​.. ఇప్పుడు ఎల్​ఆర్​ఎస్​ పేరుతో నోటిఫైడ్​ ప్రాంతంలోని భూములను గిరిజనేతరులకు రెగ్యులరైజ్​ చేసే కుట్రకు తెరలేపారని ఆరోపిస్తూ ఆదీవాసీలు జంగ్​ సైరన్​ మోగించారు. ఎల్​ఆర్​ఎస్​, ఆస్తుల సర్వేలను వెంటనే నిలిపేయాలని డిమాండ్​ చేస్తూ గురువారం కుమ్రంభీం జిల్లా జైనూర్​ మండల కేంద్రంలో మెయిన్​రోడ్డుపై మహాధర్నా చేశారు. జైనూర్​, సిర్పూర్​ యు, లింగాపూర్​ మండలాల నుంచి వేలాది మంది ఆదీవాసీలు మహాధర్నాకు తరలివచ్చారు. ఏజెన్సీలో వెంటనే ఎల్​ఆర్​ఎస్​తో పాటు ఆస్తుల సర్వేను నిలిపేస్తున్నట్టు జిల్లా కలెక్టర్​, ఐటీడీఏ పీవోలు ప్రకటన చేయాలని డిమాండ్​ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. టీఆర్​ఎస్​ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు గంటల పాటు సాగిన ఆందోళనలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జామ్​ అయింది.

ఆదీవాసీలను బాల్క సుమన్​ అవమానించిండు

ప్రభుత్వం తెచ్చిన ఎల్​ఆర్​ఎస్​, ప్రాపర్టీ సర్వేలు ఏజెన్సీ చట్టాలకు పూర్తి విరుద్ధమని తుడుందెబ్బ జిల్లా ప్రెసిడెంట్​ కోట్నక్​ విజయ్​కుమార్​, స్టేట్​ వైస్​ప్రెసిడెంట్​ మోతీరామ్​, మహిళా నాయకురాలు ఆత్రం సుగుణాబాయీ విమర్శించారు. గిరిజనేతరుల ప్రాపర్టీని అధికారికంగా ఆన్​లైన్​ చేస్తే 1/70 చట్టానికి తూట్లు పొడిచినట్టేనన్నారు. పెసా కమిటీ తీర్మానాలు లేకుండా గిరిజన గ్రామాల్లో సర్వే ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి వాటి వల్ల గిరిజనేతరుల ఆధిపత్యం పెరిగి ఆదీవాసీలు మనుగడ కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాన్ని ఎత్తేస్తేనే మందమర్రి అభివృద్ధి సాధ్యమవుతుందంటూ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అన్నారని, అది ఆదీవాసీలను అవమానించడమేనని మండిపడ్డారు. సుమన్​ ఆదీవాసీల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిరిజనేతరులు, ఆదీవాసీల మధ్య ఉన్న సంబంధాలకు టీఆర్​ఎస్​ సర్కార్​ చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వచ్చి ఎస్టీ జాబితాలో చేరిన లంబాడీ గిరిజనులతో ఆదీవాసీలు ఇప్పటికే నష్టపోయారని, ఇప్పుడు ఈ ఎల్​ఆర్​ఎస్​, ఆస్తుల సర్వేతో ఆదీవాసీల ఉనికే పోతుందని వాపోయారు. వాటిని ఆపేసి పోడుభూములకు అటవీ హక్కు పత్రాలివ్వాలని,
జీవో నెం 3పై సర్కార్​ రివ్యూ పిటిషన్​ వేయాలని డిమాండ్​ చేశారు.

బాల్క సుమన్​కు అధికారం ఎక్కడిది?

ఈ సర్వేలను ప్రభుత్వం వెంటనే ఆపాలి. లేకుంటే ఇంకో ఉద్యమం మొదలుపెడతం. చట్టాలను టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు తుంగలో తొక్కుతున్నరు. మందమర్రి ప్రాంతంలోని ఏజెన్సీని ఎమ్మెల్యే బాల్క సుమన్​ ఎత్తేయాలంటున్నారు. అతనికి ఆ అధికారం ఎక్కడిది? ఆదివాసీలను అవమానిస్తున్నారు.

– కోట్నక్​ విజయ్​కుమార్​, తుడుం దెబ్బ జిల్లా ప్రెసిడెంట్​

ఎల్​ఆర్​ఎస్​, సర్వే వద్దు

ఏజెన్సీలో ఎల్​ఆర్​ఎస్​తో పాటు ప్రాపర్టీ సర్వే కూడా వద్దు. సర్వే వల్ల గిరిజనేతరులకు ఏజెన్సీలో హక్కులు కల్పించే చాన్స్​ ఉంటుంది. ఇండ్లు, భూముల ప్రాపర్టీనీ రికార్డు చేసే ప్రయత్నం సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ చర్యలను ఆపాలి.- మెస్రం మోతీరాం, తుడుం దెబ్బ స్టేట్​ వైస్​ ప్రెసిడెంట్​

పెసా తీర్మానం లేకుండా ఎట్ల చేస్తరు?

ఏజెన్సీలో ఏదైనా చేయాలంటే పెసా కమిటీ తీర్మానం అవసరం. కానీ అలాంటిదేమీ పట్టించుకోలేదు. ప్రభుత్వం మంచి చేస్తదని మభ్యపెడుతున్నారు. ఆదివాసీలకు నష్టం చేసేందుకు ప్లాన్​ చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఇది కరెక్టు కాదు.- – జంగుబాయి, ఆదివాసీ సంక్షేమ పరిషత్​ జిల్లా మహిళా ప్రెసిడెంట్​