
- ఇటీవల ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన ఆదివాసీలు
- శనివారం 200 మందితో ఆదివాసీల పంటలను ధ్వంసం చేసిన సిబ్బంది
దండేపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్‌లో పోడు లొల్లి మళ్లీ మొదలైంది. స్థానిక ఆదివాసీలు ఇటీవల భూమిని చదును చేయడంతో పాటు అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు శనివారం వెళ్లి ఆదివాసీలు సాగు చేసిన పంటలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో 16 మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... దండేపల్లి మండలంలోని దమ్మన్నపేట, మామిడిగూడ గ్రామాలకు చెందిన ఆదివాసీలు మూడు నెలల కింద లింగాపూర్ బీట్ పరిధిలోని 380 సర్వే నంబర్‌లో ఉన్న 40 ఎకరాల ఫారెస్ట్ భూమిని చదును చేసి మక్కజొన్న, కంది, పత్తి సాగు చేశారు.
భూమి చదును చేస్తున్న టైంలోనే ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకొని కేసు నమోదు చేసినా ఆదివాసీలు అక్కడి నుంచి వెళ్లలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఆదివాసీలు ఫారెస్ట్ సిబ్బందిపై కారం పొడి చల్లి దాడి చేశారు. దీంతో శనివారం ఉదయం జిల్లా అటవీ సంరక్షణాధికారి శివ్ ఆశిశ్ సింగ్ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి పైగా ఫారెస్ట్, లక్సెట్టిపేట సర్కిల్ పోలీస్ సిబ్బంది అడవిలోకి వెళ్లి ఆదివాసీలు వేసిన పంటలను ధ్వంసం చేయడంతో పాటు వారి గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు.
జేసీబీ సాయంతో రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ ట్రెంచ్ కొట్టారు. ఈ క్రమంలో మహిళలు అడ్డుకుంటారన్న అనుమానంతో ముందస్తుగా 15 మంది ఆదివాసీ మహిళలను, ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి దండేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనాస్థలం వద్దకు మీడియాను అనుమతించకపోవడంతో పలువురు రిపోర్టర్లు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
తమను వీడియో తీశారు.. అందుకే దాడి చేశాం : ఆదివాసీ మహిళలు
శుక్రవారం సాయంత్రం తాము వాగులో స్నానం చేస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది పొదల చాటు నుంచి వీడియోలు, ఫొటోలు తీశారని ఆదివాసీ మహిళలు ఆరోపించారు. తాము కేకలు వేయడంతో స్థానికులు వచ్చారని, తమ వీడియోలు, ఫొటోలు తీశారన్న ఆగ్రహంతోనే కారం చల్లాం తప్పితే కావాలని దాడి చేయలేదని చెప్పారు. ఫారెస్ట్ ఆఫీసర్లు తమను అడవి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నంలో భాగంగానే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు.