- ముందస్తు మొక్కులకు బారులుదీరిన భక్తులు
తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతరలో భాగంగా సమ్మక్కకు గురువారం పుట్టింటి సారె సమర్పించారు. సమ్మక్క పుట్టిన ఊరైన బయ్యక్కపేటకు చెందిన చందా వంశీయులైన పరమయ్య, లక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు చీర, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, బంగారంతో డోలు వాయిద్యాల నడుమ మేడారం చేరుకున్నారు.
తమ సంప్రదాయం ప్రకారం సమ్మక్కకు సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సారాలమ్మ గద్దె వద్ద పూజలు చేశారు. కార్యక్రమంలో చందా వంశీయులు, పూజారులు గోపాల్‌రావు, రఘుపతిరావు, కల్యాణ్‌కుమార్, వెంకటేశ్వర్లు, గణేశ్, స్వామి, కిషన్‌రావు, కృష్ణ, రాంప్రసాద్ పాల్గొన్నారు.
మేడారంలో భక్త జన సందోహం
మేడారం జాతరకు మరో ఐదు రోజులే ఉండడంతో ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. గురువారం తెల్లవారుజామునే మేడారం చేరుకున్న భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించి, జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు.
అనంతరం ఎత్తు బంగారంతో గద్దెల వద్దకు చేరుకొని అమ్మవార్లకు చీర, సారె, బంగారం సమర్పించారు. సమ్మక్క, సారలమ్మను గురువారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దర్శించుకున్నారు. ఎండోమెంట్ ఆఫీసర్లు వారికి స్వాగతం పలికారు.
