రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మరింత హీటెక్కిన పాలిటిక్స్

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మరింత హీటెక్కిన పాలిటిక్స్

న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. బుధవారం (జూన్ 15న) ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో నిర్వహించబోయే వివక్షాల సమావేశం, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పవార్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. 

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో దేశ రాజకీయాలు మరింత హీటెక్కాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు కేంద్రానికి ధీటుగా బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికల రేసులో విపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలిపే ప్రయత్నంలో భాగంగా మమత ఈ భేటీ నిర్వహించనున్నారు. బుధవారం నిర్వహించబోయే ఈ విపక్షాల సమావేశానికి 22 మంది నేతలను ఇప్పటికే ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, కేరళ సీఎం విజయన్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌థాక్రే, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌లకు ఆహ్వానం పంపారు. 

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి సైతం ఆహ్వానం పంపారు దీదీ. కాంగ్రెస్‌ నుంచి మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేష్‌, రణదీప్‌ సింగ్‌ సుర్జీవాలే భేటీకి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. రేపటి భేటీకి ఎవరెవరు హాజరవుతారనే చర్చ రాజకీయ వర్గాలో జోరుగా నడుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను అభ్యర్థిగా నిలబెట్టాలని విపక్షాలు ప్రయత్నాలు చేశాయి. అయితే తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయడం లేదని పవార్ స్పష్టం చేశారు. దీంతో మరో అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. ఇక మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి శరద్ పవార్ కూడా హాజరుకానున్నారు.

మరోవైపు.. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ (ఎన్డీఏ సర్కార్ ) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే రంగంలోకి దిగి..తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీలతో చర్చించి..ఏకాభిప్రాయ సాధన దిశగా చర్చలు జరిపే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం జేడీయూ, అప్నాదళ్, అన్నాడీఎంకే, ఎల్​జేపీ, జేజేపీ, ఈశాన్య రాష్ట్ర పార్టీలైన ఎన్‌పీపీ, ఎన్​పీఫ్​, ఏజీపీ పార్టీలు ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. స్వతంత్రంగా ఉంటున్న వైఎస్ ఆర్ సీపీ, బీజేడీ పార్టీలతోనూ జేపీ నడ్డా, రాజ్​నాథ్  సింగ్ సంప్రదింపులు జరపనున్నారు.