టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య అరెస్టు

టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లో టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. గంటల తరబడి విచారణ చేసిన ఈడీ ఈ తెల్లవారుజామున అతన్ని అరెస్టు చేసింది. మాణిక్ భట్టాచార్య... ఈ కుంభకోణంలో అరెస్టయిన రెండో తృణమూల్ నాయకుడు. ఈ కేసులో ఇప్పటికే బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నిందితులుగా ఉండగా... గత కొన్ని రోజుల క్రితం వీరి ఇళ్లల్లో దాడులు చేసిన ఈడీ... రూ.50 కోట్లకు పైగా విలువైన కరెన్సీ నోట్ల కట్టలు, భారీగా బంగారం, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి పార్థ ఛటర్జీ తర్వాత అరెస్టయిన రెండో ఉన్నత స్థాయి టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య.

గతంలో మాణిక్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. రిక్రూట్‌మెంట్ స్కామ్ ఆయన హయాంలోనే జరిగిందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కోల్‌కతా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అతని పేరు ప్రస్తావించారు. కోర్టు ఆదేశంతో గత కొన్ని రోజుల క్రితమే భట్టాచార్యను విద్యా బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఛటర్జీ, ముఖర్జీలను అరెస్టు చేసిన తర్వాత భట్టాచార్యను విచారణకు పిలిచిన ఈడీ.. అనంతరం తాజాగా ఆయనను అరెస్టు చేసింది.