బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి ఇంకా నెట్టింట హాట్ టాపిక్ గానే నడుస్తోంది. తన లాంగ్ టైమ్ పార్ట్నర్ గౌరీ స్ప్రాట్‌ను ఆమిర్ ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లిపై సీనియర్ నటుడు, పాపులర్ హోస్ట్ శేఖర్ సుమన్ తన యూట్యూబ్ టాక్ షో 'శేఖర్ టునైట్'లో వేసిన పంచ్‌లు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ మసాలాకు కాస్త పొలిటికల్ సెటైర్ దట్టించి శేఖర్ సుమన్ వేసిన జోకులు నవ్వులు పూయిస్తున్నాయి.
అమీర్.. ట్రిపుల్ ఇంజన్ !
ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని శేఖర్ సుమన్ ప్రస్తావిస్తూ .. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇతని నుంచి చాలా నేర్చుకోవాలన్నారు. పొత్తులు ఎలా పెట్టుకోవాలో రాజకీయ నాయకులకు తెలుసు. కానీ పొత్తులను విజయవంతంగా ఎలా కొనసాగించాలో మాత్రం ఆమిర్ ఖాన్ దగ్గరే నేర్చుకోవాలి అంటూ చమత్కరించారు. మన దేశంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వమే నడవడం కష్టంగా ఉంటే.. ఆమిర్ ఏకంగా 'ట్రిపుల్ ఇంజన్' రన్ చేస్తున్నాడు అంటూ శేఖర్ సుమన్ సరదాగా వ్యాఖ్యానించారు.
కొత్త పోటీదారుడు వచ్చేశాడేమో...
అంతటితో ఆగకుండా మరో అదిరిపోయే పంచ్ పేల్చారు. ఆమిర్ ఖాన్ టాలెంట్ మామూలైనది కాదు. పెట్రోల్, ఇథనాల్, ఐసోబ్యూటనాల్ అన్నీ కలిపిన ఇంజిన్ లా ఆయన జీవితం సాగుతోంది. అయినా ఆ ఇంజిన్ ఎక్కడా ఆగకుండా కొత్త గమ్యం వైపు సాఫీగా పరుగులు తీస్తోందన్నారు. ఆమిర్ ఖాన్ ఫుల్ మెజారిటీతో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. ఆమిర్ ఏమన్నా ఎన్డీఏ ప్రభుత్వమా ఏమిటి? నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోడీ కూడా ఇప్పుడు ఆమిర్‌ను చూసి కొత్త పోటీదారుడు వచ్చేశాడేమో అనుకుంటారేమో అంటూ మరోసారి రాజకీయ వ్యంగ్యంతో నవ్వులు పంచారు
ఈ వ్యాఖ్యల వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు శేఖర్ సుమన్ కామెడీ టైమింగ్‌ను ప్రశంసిస్తుంటే, మరికొందరు ఆమిర్ వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలపై చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆమిర్ ఖాన్ ఇటీవల తన చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను ముంబైలోని బాంద్రా నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు, పిల్లలు ఇరా ఖాన్, జునైద్ ఖాన్, ఆజాద్ రావు ఖాన్ కూడా హాజరుకావడం విశేషంగా నిలిచింది. మరి శేఖర్ సుమన్ పొలిటికల్ కౌంటర్లు ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో చూడాలి.
