- త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి సూచన
- ఇంటి భాష .. బడి భాషగా మారితేనే మాతృభాషకు గౌరవం
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీల్లో బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు రావాలని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి సూచించారు. విద్యార్థులకు కేవలం థియరీ మాత్రమే కాకుండా, వారి అభిరుచులకు తగ్గట్టుగా ఇతర కళలను జోడించి, ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో పాఠాలు బోధించాలని అభిప్రాయపడ్డారు. శనివారం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఆధ్వర్యంలో మాతృభాషాదినోత్సవం, 2026 సంస్కృతి పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇంటి భాష.. బడి భాషగా మారినప్పుడే మాతృభాషకు గౌరవం దక్కుతుందన్నారు. ప్రతి స్కూల్‌లో మాతృభాషను అనివార్యం చేయాలని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐని కూడా తెలుగులోనే ప్రశ్నించాలని, అప్పుడే మన భాష సాంకేతికంగా విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తన తండ్రి మండలి వెంకటకృష్ణారావు పేరిట ఈ పురస్కారం అందిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. మాజీ ఐఏఎస్ కేవీ రమణాచారి మాట్లాడుతూ నిస్వార్థ రాజకీయ నాయకుడు మండలి వెంకటకృష్ణారావు అని కొనియాడారు. తెలుగు వర్సిటీ వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి భాషా కోర్సులు అందిస్తున్నామని, పండుగలకు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. త్రిపుర ప్రభుత్వం సహకరిస్తే అక్కడ కూడా మన సంస్కృతిని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం భాషా సంస్కృతుల పరిరక్షణకు కృషి చేస్తున్న పుణె, ఆంధ్ర సంఘం సలహాదారు తిరువలూరి వంగీపురం శ్రీనివాస్‌ను ఈ ఏడాది ‘సంస్కృతి పురస్కారం’తో సత్కరించారు.
