
హైదరాబాద్, వెలుగు:సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వంపై పెరుగుతున్న విమర్శలను తిప్పికొట్టేందుకు పార్టీ సిద్ధమవుతోంది. గతంలో ప్రభుత్వాన్ని, పార్టీని సమర్థించిన వారు సైతం ఇప్పుడు విమర్శలకు దిగుతుండడంతో నష్ట నివారణ చర్యలకు దిగింది. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాలో విమర్శలు పెరిగిపోయాయి. కొన్ని పోస్టింగులు ప్రభుత్వాన్ని, పార్టీని ఊపిరి తీసుకోనివ్వని స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు సోషల్ వారియర్స్‌ను రెడీ చేసుకుంటోంది. వారికి పోస్టింగ్ బై పోస్టింగ్ కౌంటర్ ఇచ్చేలా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది.
ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్స్‌యాప్, ఇన్‌స్టాగ్రాం, టెలిగ్రాం.. వేదిక ఏదైనా ప్రభుత్వం, పార్టీపై ఒక్క పోస్టింగ్ పడగానే నలు దిశలా దాన్ని కౌంటర్ ఎటాక్ చేసేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను పార్టీ రెడీ చేస్తోంది. ఉద్యమకాలంలో మాదిరి ఎదురుదాడికి సన్నద్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సోషల్ మీడియా టీం మాత్రమే ప్రభుత్వాన్ని, పార్టీని వివిధ సందర్భాల్లో ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ ప్రాజెక్టులపై వచ్చిన విమర్శలను దీటుగా తిప్పికొట్టగలిగింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగించింది. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో ప్రజల్లో భావోద్వేగాలను రగల్చడంలో సోషల్ మీడియా టీం విజయం సాధించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రభుత్వం, పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతున్నా వాటిని సరిగ్గా కౌంటర్ చేయలేకపోతోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ వారియర్స్‌ను మరింత రాటుదేల్చేందుకు పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన సోషల్ మీడియా కార్యకర్తలకు తొలుత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శిక్షణ ఇప్పించి వారి ద్వారా గ్రామాలు, వార్డుల్లోని పార్టీ కార్యకర్తలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు బుధవారం తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. పార్టీ, ప్రభుత్వం, నాయకులపై వస్తోన్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలో పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యతలు చూస్తున్న నిపుణులు వివరించారు. తర్వాతి దశలో టీఆర్‌ఎస్ పార్టీని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేతలు హరీశ్‌రావు, కవితతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫాలోవర్లను సోషల్ మీడియాలో కౌంటర్ ఎటాక్‌కు ఉపయోగించుకోనున్నట్లు చెబుతున్నారు.