బీజేపిని రాజకీయంగా ఎదుర్కొలేకే టీఆర్ఎస్ దాడులు

బీజేపిని రాజకీయంగా ఎదుర్కొలేకే  టీఆర్ఎస్ దాడులు
  • భౌతిక దాడులకు పాల్పడటం సిగ్గుచేటు
  • టీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు
  • బీజేపి లీడర్ విజయశాంతి

తెలంగాణలో బీజేపిని రాజకీయంగా ఎదుర్కొలేకే  టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపి నేత విజయశాంతి అన్నారు. ప్రజల్లో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని, అది చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ సర్కారు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడి అందుకు నిదర్శనమన్నారు. నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని పలు గ్రామాల్లో ఎంపీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి అరవింద్ వెళ్తే టీఆర్ఎస్ గుండాలు దారిలో అడ్డుకుని దాడి చేయడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అన్నారు.

ఎంపీ కాన్వాయ్ పై రాళ్లు, కత్తులతో దాడి చేసి రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని కేసీఆర్ మరోసారి రుజువు చేశారని విమర్శించారు. పోలీసులు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం చూస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అనే సందేహం కలుగుతోందన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు టీఆర్ఎస్ సర్కారుకు తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. ఒక పార్లమెంట్ సభ్యుడికే ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు.  చట్టం మీద నమ్మకంతోనే తమ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తున్నారని.. లేకుంటే టీఆర్ఎస్ దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని, రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి..

టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించిన కేసీఆర్